calender_icon.png 27 January, 2026 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలి

27-01-2026 12:00:00 AM

కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ 

సూర్యాపేట, జనవరి 26 (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు రాజ్యాంగ  నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని సూచించారు.

సమాజంలో వెనుకబడిన ఎస్టీ, ఎస్సీ, బీసీ ల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. అందరు ఐక్యంగా ఉంటూ  అన్ని రంగాల్లో దేశాన్ని బలోపేతం చేయాలన్నారు. ఒక్కొక్క ఫైలు క్షేత్రస్థాయిలో ఒక్కరి జీవితం పై ఆధారపడి ఉంటుంది కాబట్టి వేగవంతంగా క్షేత్రస్థాయిలో ఫైల్స్ ను పరిశీలించి  పరిష్కరించాలన్నారు.

ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. తదుపరి జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు ప్రశంశా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు, జిల్లా అధికారులు, పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.               

వాడవాడలా గణతంత్ర దినోత్సవం 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. ముఖ్యంగా కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మహిళా మండలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, గ్రంథాలయం, మండల సమాఖ్య కార్యాలయం, మున్సిపాలిటీ ఎమ్మార్వో, ఆర్డీవో, మండల పరిషత్ కార్యాలయాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని కోర్టులు, ఆర్డీవో, తాసిల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ లు, ఏవో తదితర కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల అధికారులు పతాకావిష్కరణలు గావించారు.

ఘనంగా గణతంత్ర దినోత్సవం 

ఆలేరు:  77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ హనుమంతరావు డా.బి ఆర్ అంబేడ్కర్ , మహాత్మా గాంధీ చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించి, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా  జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అనంతరం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై  డీసీపీ అక్షాంక్ష్ యాదవ్ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ,రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అక్షాంష్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, డి.ఆర్.ఓ జయమ్మ, ఆర్డీఓ లు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పథంలో జిల్లాను నిలుపుదాం: కలెక్టర్ చంద్రశేఖర్

నల్లగొండ టౌన్: జిల్లాలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం మిన్నంటాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి వివిధ శాఖల ద్వారా జరుగుతున్న కృషిని వివరిస్తూ.. సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్ ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి కవితలు, నృత్య కళ రూపకాలు చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి జిల్లా ప్రగతిని కళ్లకు కట్టేలా మున్సిపాలిటీ, వైద్యారోగ్య, వ్యవసాయ, ఉద్యానవన, పోలీస్, గృహనిర్మాణ, ఐసీడీఎస్ తదితర శాఖలు రూపొందించిన శక టాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిద శాఖల స్టాళ్లను కలెక్టర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించి పరిశీలించారు.

ప్రతిభకు పురస్కారం..

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ఈ సందర్భంగా గుర్తించి, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన వారికి ఈ పురస్కారాలు స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ లు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.

అలాగే రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.