26-07-2025 06:56:38 PM
పార్టీ లీగల్ సెల్ ను బలోపేతం చేయాలి..
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్(PCC Legal Cell Chairman Ponnam Ashok Goud) తెలిపారు. శనివారం న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అహర్నిశలు పాటుపడుతోందన్నారు. సమాజానికి అండగా ఉంటూ హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. శనివారం నల్గొండలోని రెవెన్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి నరసింహ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు పొందిన న్యాయవాదులు పార్టీ కార్యకర్తలకు తప్పనిసరిగా న్యాయ సహాయం అందించాలని కోరారు.
పదవి పూర్తయిన తర్వాత పార్టీని విస్మరించడం సరైన విధానం కాదన్నారు. అదేవిధంగా పార్టీలో పని చేసిన న్యాయవాదులకే పార్టీ పరంగా వచ్చే పదవులలో అవకాశం కల్పించాలని అన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ బిల్లు పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది న్యాయవాదులంతా హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయవాదులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ అధికారంలో రావడంలో న్యాయవాదుల పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయని, వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ న్యాయవాదులంతా మద్దతుగా ఉన్నారని తెలిపారు.
న్యాయ వాదుల రక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి,పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు, న్యాయవాది నాంపల్లి భాగ్య, ఏజీపీలు శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, వీరయ్య, న్యాయవాదులు నామిరెడ్డి మోహన్ రెడ్డి, మెమీన్ రోషన్ జమీర్, ఉమా శంకర్, మేడ మోహన్ రెడ్డి, నఫీస్ ఫాతిమా, చక్రవర్తి ,పాశం నరేష్ రెడ్డి, మామిడి శ్రీను, వెంకటేశ్వర్ రెడ్డి ,ఈ.దేవా, బిక్షపతి గౌడ్, రాజకుమార్, పొన్నం రవీందర్ ,రత్నారెడ్డి, లుక్మాన్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ను జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.