calender_icon.png 27 July, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు

26-07-2025 06:59:37 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వం పేద ప్రజలకు నూతనంగా అందిస్తున్న రేషన్ కార్డులతో అర్హులందరికీ ఉచిత సన్న బియ్యం అందుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అన్నారు. శనివారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మా బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel), ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి హరికిరణ్ తో కలిసి కలెక్టర్ అర్హులైన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అన్నింటికి రేషన్ కార్డులే ప్రామాణికం అని, గత కొద్ది రోజులుగా నూతన రేషన్ కార్డులు అందకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ ఆరు కిలోల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సన్న బియ్యం అందుతాయని చెప్పారు. కడెం మండలంలో  966 నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని అన్నారు.

2 వేలకు పైగా రేషన్ కార్డులలో పేర్లు చేర్చడం జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ప్రజలకు నూతన రేషన్ కార్డులు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నారని చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గంలో దాదాపు 20 వేల కుటుంబాలకు లబ్దిచేకూరిందని తెలిపారు. ప్రజలకు నూతన రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వం అందించు అన్ని పథకాల ఫలాలు పొందుతారని అన్నారు. నూతనంగా రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో మరింత మంది ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, వంటగ్యాస్ సబ్సిడీ, వంటి ఎన్నో పథకాలను అదనంగా పొందుతారని అన్నారు.

పేద ప్రజలందరూ పస్తులు ఉండకుండా నాణ్యమైన ఆహారాన్ని మూడు పూటలా కడుపునిండా తినాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత బృందాలు ప్రభుత్వ పథకాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, తదితర అంశాలపై అవగాహన కలిగేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి ఛైర్మెన్ పడిగెల భూమన్న భూషణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, రేషన్ కార్డుల లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.