calender_icon.png 23 December, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండెక్కిన గుడ్డు, చికెన్ ధరలు

23-12-2025 02:07:32 AM

రికార్డు స్థాయికి పెరుగుదల 

గుడ్డు ధర రూ.8 నుంచి రూ.8.50

చికెన్ కిలో రూ.271

కూరగాయలది అదే దారి 

పెరిగిన ధరలతో జనం బెంబేలు 

మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 22(విజయ క్రాంతి): కూరగాయలు, గుడ్లు, చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయలు, మాంసాహార ధరలు ఒకేసారి పెరుగుతుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కడుపునిండా తినలేని పరిస్థితి నెలకొంది. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రోటీన్ ఆహారమైన గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. ఒక్క గుడ్డు కొన్నిచోట్ల రూ.8, మరి కొన్నిచోట్ల రూ.8.50 కు విక్రయిస్తున్నారు. గతంలో ఐదు, ఆరు రూపాయలకు మాత్రమే లభించేది.

ఇంట్లో కూర రుచిగా లేకుంటే వెంటనే దుకాణానికి వెళ్లి గుడ్లు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం గుడ్లు కొనుగోలు చేయడానికి వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుడ్ల వినియోగం పెరగడం, ఉత్పత్తి తగ్గడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. దాన ధరలు పెరగడం వల్ల గిట్టుబాటు గాక చాలా కోళ్ల ఫారాలు మూతపడ్డాయి. దీంతో ఉత్పత్తి తగ్గి పోయింది. చిన్న కోళ్ల ఫారాలు మూతపడగా పెద్ద కోళ్ల ఫారాలు మాత్రమే మిగిలాయి. పెద్ద కోళ్ల ఫారాల యజమానులు, కంపెనీలు సిండికేట్‌గా మారి ధర పెంచుతున్నారని పలువు రు ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. 

చికెన్ ది అదే దారి 

మటన్ ధర కిలోకు రూ. 900 నుంచి రూ. 1000 ఉంది. ఇది కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని వారు చికెన్ కొనుగోలు చేస్తారు. చికెన్ ధర సైతం పెరుగుతోంది. వారం రోజులుగా చికెన్ ధరలో పెరుగుదల కనిపిస్తోంది. మొన్నటి వరకు స్కిన్ లెస్ కిలోపు రూ. 220 వరకు లభించగా ప్రస్తుతం రూ. 271కి ఎగబాకింది. ప్రస్తుతం చాలామంది అయ్యప్ప మాలలో ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లో మాంసాహార వంటలు చేయరు. అంతేగాక శుభకార్యాలు కూడా లేవు. ఈ రోజుల్లో చికెన్ వినియోగం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఇంతవరకు పెరుగుతోందోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పెరిగిన కూరగాయల ధరలు 

కూరగాయల ధరలు సైతం బాగా పెరిగాయి ఏ కూరగాయ ధర అయినా కిలోకు రూ. 80 పైనే ఉంది. గతంలో మాదిరి కూరగాయలు మార్కెట్లోకి రావడం లేదు. కొన్ని కూరగాయలు దొరకడం లేదు. తక్కువ ధర పలికే టమాటా సైతం రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం టమోటా ధర రూ. 80 కి చేరింది. వర్షాకాలంలో వర్షాలు బాగా కురవడం వల్ల పంట దెబ్బ తినడంతో రైతులు మళ్లీ కూరగాయలు సాగు చేయలేదు. అంతేగాక ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి తీవ్రత వల్ల దిగుబడి రావడం లేదని మార్కెటింగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల భారంగా తయారైందని పేద మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. ధరలు ఎంతవరకు పెరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.