calender_icon.png 12 September, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశ్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు

04-09-2025 12:12:07 AM

డిప్యూటీ కమిషనర్ జాకీయ సుల్తానా

మల్కాజిగిరి, సెప్టెంబర్ 3(విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి సర్కిల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ జాకీయ సుల్తానా తెలిపారు. బుధవారం సఫీల్ గూడ మినీ ట్యాంక్ బండ్, బండ చెరువు బేబీ పాండ్లలో నిమజ్జన ఏర్పాట్లను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

బ్యారికేడింగ్, లైటింగ్, క్రేన్ల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను సమీక్షించారు. డీసీ జాకీయ సుల్తానా మాట్లాడుతూ మల్కాజిగిరి పరిధిలోని రెండు ప్రధాన చెరువులను నిమజ్జనానికి సిద్ధం చేశామని, నాలుగు స్థిర క్రేన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హై డ్రా, పర్యాటక శాఖ సహకారంతో చెరువుల వద్ద బోట్లను, డీఆర్‌ఎఫ్ టీంలను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు.

ప్రత్యేక లైటింగ్ & సెక్యూరిటీ..

నిమజ్జనం జరిగే ప్రదేశాలు, ఊరేగింపు మార్గంలో సుమారు 700 తాత్కాలిక లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలీసుల సమన్వయంతో 2 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని, 32 కిలోమీటర్ల ఊరేగింపు మార్గంలో గ్రీన్ వేస్ట్ లిఫ్టింగ్ పూర్తి చేశామని తెలిపారు.

స్వచ్ఛత & హెల్త్ సదుపాయాలు..

మూడుచొప్పున షిఫ్టుల్లో 148 మంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారని, వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను టిప్పర్ల ద్వారా డంప్ యార్డ్కు తరలించామని చెప్పారు. గణేశ్ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో 6 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మెడికల్ సదుపాయాలు..

ఊరేగింపులో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు 2 మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు మూడు షిఫ్టుల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

రోడ్డు భద్రత చర్యలు..

మల్కాజిగిరి వ్యాప్తంగా రోడ్డు భద్రత డ్రైవ్లో భాగంగా 75 శాతం పైగా గుంతలను పూడ్చివేశామని డీసీ వివరించారు. గణేశ్ నిమజ్జనం ఎటువంటి అంతరాయం లేకుం డా సురక్షితంగా, సాఫీగా జరిగేలా అన్ని చర్య లు తీసుకున్నామని డీసీ జాకీయ సుల్తానా భరోసా ఇచ్చారు.