calender_icon.png 8 September, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో వృద్ధ జంట ఆత్మహత్య

08-09-2025 12:00:00 AM

తాండూరు, 7 ఆగస్టు, (విజయక్రాంతి) : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం లో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన  మంచన్ పల్లి శ్రీనివాస్ రెడ్డి(63) భాగ్యమ్మ(55) దంపతులు. వ్యవసాయమే వీరి జీవనాధారం. ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు ఉండగా పట్టా భూమి రెండు ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

పంటలు దిగుబడి రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులు చేతికి అందకపోవడం వల్ల అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చేందుకు రెండు ఎకరాల పట్టా భూమిని సైతం విక్రయించారు. వచ్చిన డబ్బులతో కొంత అప్పు తీర్చి ఇద్దరు కుమారులకు పంచారు. పెద్ద కుమారుడు కరుణాకర్ రెడ్డి వ్యాపారం చేసుకుంటూ వేరే గ్రామంలో ఉంటున్నాడు చిన్న కుమారుడు దయాకర్ రెడ్డి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.

డబ్బుల విషయమే గత రాత్రి కుటుంబంలో తగాదా జరిగినట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులకు కుటుంబ సగాధాలు తోడు కావడంతో మనస్థాపం చెందిన ఆదివారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య భాగ్యమ్మ సమీపంలో వాగులోకి దూకి ఆత్మహత్య చేసు కుంది.

గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పేద కుటుంబం అయినా గౌర వంగా బ్రతికే వారని గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు శవాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.