29-09-2025 05:21:52 PM
అదనపు కలెక్టర్(రెవిన్యూ) లక్ష్మీనారాయణ
గద్వాల: సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం పౌరులు ఆయా శాఖల నిర్దేశిత సమాచారం నిబంధనల ప్రకారం అడిగినప్పుడు నిర్ణీత సమయంలో ఇవ్వడం సంబంధిత అధికారుల బాధ్యత అని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. సమాచార హక్కు చట్టం కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం గద్వాల ఐడిఓసిలోని అదనపు కలెక్టర్(రెవిన్యూ) చాంబర్లో జిల్లా స్థాయి అప్పిలేట్ అథారిటీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులతో ఆర్టిఐ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులను దరఖాస్తుదారులు ఆర్టిఐ ప్రకారం సమాచారం అడిగినప్పుడు నిబంధనల ప్రకారం తమ వద్ద ఉన్న సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాలన్నారు.
ఇదివరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించే వాళ్ళమని, ఇకపై ప్రతినెల సమావేశం ఉంటుందన్నారు. ప్రతినెల ఆయా శాఖలకు ఆర్టిఐ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఎన్నింటికి సమాచారం ఇచ్చారు, అప్పిలేటి స్థాయిలో ఎన్ని ఉన్నాయో సమాచార కమిషనరేట్కు వివరాలు పంపించాల్సి ఉంటుందన్నారు. ఏదైనా శాఖలో పౌర సమాచార అధికారి, సహాయ అధికారి, అప్పిలేటు అధికారుల బదిలీలు జరిగినప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు తప్పులు లేకుండా బోర్డులో రాసి ఉంచాలన్నారు. సమావేశంలో ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.