calender_icon.png 31 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్ల్యూపీఎల్‌కు ఎల్లిస్ పెర్రీ దూరం

31-12-2025 01:02:21 AM

  1. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఆల్‌రౌండర్
  2. రీప్లేస్‌మెంట్‌గా సయాలీ సత్ఘరే

ముంబై, డిసెంబర్ 30: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ డబ్ల్యూపీఎల్ నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి ఆమె వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. మహిళల క్రికెట్‌లో అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా పేరున్న పెర్రీ 2024 సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. వుమెన్స్ ఐపీఎల్‌లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకూ 25 మ్యాచ్‌లు ఆడి 8 హాఫ్ సెంచరీలతో 972 పరుగులు చేసింది.

అటు బంతితోనూ రాణించి 8.25 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. వ్యక్తిగత కారణాలతో పెర్రీ తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్ఘరేను తీసుకుంది. సయాలీ గతంలో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడింది. ఈ సీజన్ వేలంలో ఆమెను ఎవ్వరూ తీసుకోలేదు. ఇప్పుడు పెర్రీ తప్పుకోవడంతో సయాలీకి అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే మరో ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియాకే చెందిన అన్నాబెల్ సదర్లాండ్ కూడా వ్యక్తిగత కారణాలతో సీజన్ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో ఢిల్లీ అలానా కింగ్‌ను తీసుకుంది.