16-05-2025 12:46:44 AM
తొర్రూర్, మే 15: కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్, ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
తొర్రూరులో జిల్లా కార్యదర్శి కొండం జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తాము కొత్తగా బోనస్ లు,ఎలాంటి అదనపు భత్యాలు, అదనపు కోరికలు కోరడం లేదని, డిఏలు అనేవి పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రకటించాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేక కమిటీ వేయాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, ఇంకో 15 రోజుల్లో ఆరో డిఏ కూడా ఇవ్వాల్సి ఉంటుందని వెంటనే పెండింగ్ డిఏలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి పేరివిజన్ కమిషన్ వేసి, అమలు చేయాల్సి ఉండగా పేరివిజన్ కమిషన్ వేసి 21 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు స్పందన కరువైందన్నారు. వెంటనే పేరివిజన్ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలని కోరారు.
పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్ అందజేయాలని కోరారు. జిల్లాలో మూతబడిన 144 పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో తెరిపించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 411 పాఠశాలలకు ప్రహరీ గోడలు లేవని, 130 పాఠశాలల్లో మూత్రశాలలు లేవని వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య, జిల్లా కార్యదర్శి పెండ్లి రవీందర్ రెడ్డి, పీజీ హెచ్‌ఎం హేమాద్రి, సూరం ఉపేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కొలుపుల శ్రీనివాస్, భోగ సంపత్ కుమారస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సబియా బాను తదితరులు పాల్గొన్నారు.