24-08-2025 12:34:46 AM
-దాడులు కేసులు నమోదు చేస్తున్న ఏసీబీ
-ప్రాసిక్యూషన్‌కు మాత్రం ప్రభుత్వ అనుమతులు రావు
-చివరకు శాఖపరమైన విచారణకు ఆదేశం
-కొన్ని కేసుల్లో తదుపరి చర్యల్లేకుండా ఆర్డర్ పాస్
-సీఎం రేవంత్‌రెడ్డికి ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగి పోయిందని, విధి నిర్వహణలో తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉద్యోగులకు లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆరోపించారు. సామాన్యులు ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని వాపోయారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కొన్ని సందర్భాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒకే అధికారిని రెండు, మూడుసార్లు లంచం డిమాండ్ కేసుల్లో పట్టుకోవడాన్ని చూస్తే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అలాంటి కేసుల్లో ఏసీబీ కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి సదరు అధికారిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కోరుతుందని, అయినప్పటికీ.. సచివాలయం నుంచి అనుమతు లు రావడం లేదని పేర్కొన్నారు.
దీంతో చివరకు అలాంటి కేసులు శాఖాపరమైన విచారణ అని, లేదా కేసు విత్ డ్రా చేయడం గాని జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సచివాలయం అవినీతి అధికారులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. రెవెన్యూశాఖ మాదిరిగానే ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతున్నదని వివరించారు. ఇప్పటికైనా సీఎం స్పందించి ప్రాసిక్యూట్‌కు నెలలోపే ఇవా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.
కొన్ని అవినీతి కేసు ఉదాహరణలు..
- రంగారెడ్డి జిల్లాలో ఆర్డీవో సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ మోహన్ రావు కొన్నేళ్ల క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ సమగ్ర విచారణ జరిపి సదరు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోరింది. కానీ, ప్రభు త్వం కొద్దిరోజుల తర్వాత సత్యనారాయణపై కేసు విత్ డ్రా చేస్తూ ఆయన సహాయకుడు మోహన్‌రావును ప్రాసిక్యూట్ చేయమని రంగా రెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలిచ్చింది. 14 సంవత్సరాలుగా ఈ కేసు పురగోతి ఏమీ లే దు. ఇప్పటికీ ఆ కేసు పెండింగ్‌లో ఉంది.
- రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ రామునాయక్ 201లో లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. ఏసీబీ ఆయన ఇంటిని సోదా చేయగా, ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు తేల్చింది. సదరు అధికారిపై రెండు కేసులు నమోదు చేసింది. ఒకటి ట్రాప్ కేసు, రెండోది ఆదాయానికి మించిన ఆస్తులు. రెండు కేసుల్లో ఏసీబీ సమగ్ర విచారణ జరిపి, ప్రాసిక్యూషన్ కోసం రాష్ట్రప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు నిరాకరించింది. 14 ఏళ్ల నుంచి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
- రంగారెడ్డి జిల్లాలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సహదేవ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ కేసు సమగ్ర విచారణ జరిపి సదరు అధికారి ప్రాసిక్యూట్ కోసం 2011లో ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం అందుకు ఒప్పుకోకుండా, 2014లో శాఖాపరమైన విచార ణకు ఆదేశించింది. ఈకేసు కూడా అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది.
- ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ వనజకుమారి లంచం తీసుకుంటూ 2013తో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ సమగ్ర విచారణ జరిపి 2013లో ప్రాసిక్యూట్ కోసం ప్రభుత్వ అనుమతి కోరింది. ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు ఒప్పుకోలేదు. పైగా ఆ కేసును మూసివేసి సద రు అధికారిణిపై తదుపరి చర్యలు లేకుం డా ఆర్డర్ పాస్ చేయడం గమనార్హం.