24-08-2025 12:24:22 AM
బుధవారం వినాయక చవితి:
గణపతి, వినాయక, విఘ్నేశ్వర, గణేశ మున్నగు పేర్లతో నొప్పు నీ దేవుని పూజ ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థినాడు జరుపబడును. ఈ విఘ్నేశ్వరుడు పౌరాణిక కాలమందు చాల ప్రాముఖ్యమునకు వచ్చెను. హిందువులు ప్రతి శుభకార్యమునకు ముందును విఘ్నేశ్వరుని పూజ జరుపుట యాచారమైనది. ఈ విఘ్నేశ్వరునికి నింతటి ప్రాముఖ్యము కలుగుట యే కారణముననో యూహింపశక్యముగాదు.
పౌరాణికము:- ఈ విఘ్నేశ్వరుని యుత్పత్తి విషయమై యీ ప్రకారముగా చెప్పుదురు. శివుడొకనాడు వేటాడుటకై వెడలెను. పార్వతి యింట స్నానము చేయుటకై సిద్ధమగుచు, ద్వారము దగ్గఱ కావలి యుండుటకై యొక మట్టి విగ్రహమునుజేసి, దానికి జీవము కల్పించి స్నానపు గది లోనికి ఎవ్వరిని రానియ్యకుమని యా జీవపు బొమ్మకు చెప్పి, తాను స్నానము చేయబోయెను. ఇంతలో శివుడు వేటనుండి తిరిగివచ్చి లోపలబోవ ప్రయత్నింపగ నీ విఘ్నేశ్వరుడు నివారించెను.
శివునికి కోపము వచ్చి తల నఱికి లోపలికేగెను. పార్వతి యీ సమాచారమును విని తను సృష్టించిన కుమారుని మరల పునర్జీవుని చేయమని పట్టుపట్టెను. శివుడు తాను నఱికిన తలను మరల మొండెమున కతికింపనెంచి చూడగా, నా తల కనపడకపోయెను.
అప్పుడు సమీపమున నుండిన యొక యేనుగు తలను కోసి యీ మొండెమున కతికించి జీవము వచ్చునట్లు చేసెను. ఈ యేనుగు తలగల దేవుని విఘ్నేశ్వరుడని వ్యవహరింతురు. ఇట్లు వికారముగా నొనరించిన కారణమున దానికి ప్రత్యామ్నాయముగా నీ విఘ్నేశ్వరుని కగ్రపూజ జరుగున ట్లేర్పాటు చేసెను. కొంతకాలమున కీ దేవుడు విద్యకుగూడ నధిపతి యయ్యెను.
నామమలు:- భాద్రపద శుద్ధ చతుర్థినాడు విఘ్నేశ్వరుని విగ్రహమొకటి మట్టితో జేసి పూజింతురు. ఈ వినాయకునికి వాహనము ఎలుక. కావుననే యితనిని ‘మూషకవాహన’ యని యందురు. ఇతనికొకే దంతము. కావుననే ‘యేకదంతా’ యని సంబోధింతురు. ఇతని కడుపు పెద్దది. తిండికాడు. కావుననే ‘లంబోదరా’ యని పిలుతురు. చెవులు చేటల వంటివి. కావుననే ‘శూర్పకర్ణా’ యని వ్యవహరింతురు.
సర్వసిద్ధులను కలిగిన వాడని యితనిని సర్వసిద్ది ప్రదాయకుడని వ్యవహరింతురు. ఈ ప్రకారముగా నీ దేవునికి సహస్రనామములున్నవని యందురు.
పూజావిధి:- ప్రతి గృహమందును శుద్ద చతుర్థినాడు ప్రాతఃకాలమందు వినాయకుని మంత్రపూర్వకముగా నానా విధములగు పత్రపుష్ప ఫలములతో పూజింతురు. భాద్రపద మాసమందలి ఫలపుష్పములన్నియు సమర్పింతురు.
వినాయకునికి కుడుములు ఇష్టము. కావుననే,
నానాఖాద్య మిదం దివ్యం తుష్ట్యర్థం తే నివేదితం
ఏకవింశతి సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం సఫలం దద్యాం నమస్తే విఘ్ననాశినే.
మాలతీపత్రము, భృంగరాజపత్రము, బిల్వపత్రము, బదరి, శమీపత్రము, అపామార్గపత్రము, బృహతీపత్రము, కరవీరము, అర్కము, విష్ణుక్రాంత, దానిమ్మయాకులు, దానిమ్మపండు, దేవదారు, అశ్వత్థము, మొగలిపువ్వులు మున్నగువానిచే విఘ్నేశ్వరుని పూజింతురు.
21 కుడుములు నేతితో జేసినట్టివి - లెక్క పెట్టి వీరికి నైవేద్యముగా నిడవలయునట. వినాయకుని దగ్గఱ నొక దీపము వెలిగించి యుంచుదురు. ఇది యారిపోనట్లుగా మరునాటివఱకుంచుదురు. మఱుదివసము సాయంకాలము - వినాయకుని మట్టి ప్రతిమను బావిలో, లేక నదిలో వేయుదురు.
విఘ్నేశ్వరుడు సర్వాభీష్టముల నొసంగువాడని యందఱును నీవ్రత మాచరింతురు. వ్రతచూడామణియం దీ వ్రతమును గుఱించి యిట్లు వ్రాయబడినది:
నైమిశారణ్యమున శౌనకాది మునులు సర్వకార్యములు నిర్విఘ్నముగా నడచు మార్గ మెద్దియని సూతుని విచారింపగా నాతడిట్లని చెప్పదొడగెను: పూర్వము కురుపాండవ సేనలు యుద్ధము చేయగడగినప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో దాను జయమందుటకు మార్గమెద్ది యని విచారించెను. అందులకు శ్రీకృష్ణుడిట్లు చెప్పెను: “నీవు గణాధ్యక్షుడగు గణపతిని పూజింపుము. నీ రాజ్యము నీకు లభింపగలదు.”
యుధిష్ఠిరుడు ఆ పూజ ెుట్లు చేయవలెనని విచారింపగా కృష్ణుడిట్లు చెప్పెను:
భాద్రపద శుక్ల చతుర్థి మధ్యాహ్నమందు, లేక శ్రావణ మాసమందుగాని, మార్గశీర్ష మాసమందుగాని వినాయకుని మంత్రయుక్తముగా పూజించి యతనికి నైవేద్యము సమర్పింపవలయును. ఆ దినము బ్రాహ్మణుల కెంత దక్షిణ యిచ్చిన అంతకు పదియంతలు మరల ఆ యిచ్చిన దాతకు సమకూరును.
ఈ చతుర్థినాడు చంద్రుని చూచినవారి కొక సంవత్సర పర్యంతము లేనిపోని యపవాదములు కలుగుచుండునని పురాణములు చెప్పుచున్నవి. ఈ దోష పరిహారార్థమై యీ క్రింది మంత్రము నుచ్చరించవలయునట.
సింహె ప్రసేన మవధీ త్సింహె జాంబవతా హతః,
సుకుమారక మారోది స్తవ హ్యేష స్యమంతకః.
ఈ మంత్రమును జదువుటయే కాక స్యమంతకోపాఖ్యానమును గూడ వినవలయును. చంద్ర దర్శన దోషమునకు కారణమిట్లు చెప్పుదురు. విఘ్నేశ్వరుడు తనను పూజించిన బ్రహ్మకు వరము లొసగి, మూషకముపై స్వారీచేయుచు చంద్రలోకమును జేరుతఱి తట్టుకొని పడెను. అది చూచి తన సౌందర్యమునకు గర్వించిన చంద్రుడు పక్కున నవ్వి, వినాయకునికి పట్టరాని కోపము వచ్చి “ఓరి చంద్రా! నీ ముఖమును జూచిన వారందరును మిథ్యాపవాదములకు లోనగుదురుగాక!” యని శపించెను. చంద్రుడు భయభ్రాంతుడై సముద్రమున దాగెను. లోకమంధకార బంధురమ య్యె నను.
దేవతలు తల్లడిల్లిరి. అప్పుడు త్రిమూర్త్యాదు లందఱును జేరి చంద్రునికి వినాయకుని పూజించు విధా నమును నేర్పి వినాయకుని ప్రసున్నునిగా చేసిరి. వినాయకుడప్పుడు శాపము కేవలము భాద్రపద శుద్ధ చతుర్థ దినము నాటికి మాత్రమే వినియోగమగునని సెలవిచ్చెను. ఆనాడు పొరపాటుతో చూచినవారికి సహితము విముక్తి ెుట్లని ప్రార్థింపగా నా దినము వినాయకు పూజించి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి స్యమంతకోపాఖ్యానము జదువు వారికే యపవాదములు నుండవని చెప్పెనట.
స్యమంతకోపాఖ్యానము:- ఈ కథ భాగవతమందును, స్కాందపురాణ మందును నున్నది. దీనినే యిచ్చట సంగ్రహముగా సూచింతును. శ్రీకృష్ణుడు ద్వారకలో రాజ్యము చేయుచుండగా నందొక యాదవుడు గ్రసేనుడను వాడుండెను. అతనికి సత్రాజిత్తు, ప్రసేనుడు నను నిరువురు కుమారులుండిరి. అందు సత్రాజిత్తు సూర్యసం బుద్ధలోచనుడై సూర్యభగవాను నారాధింప నా దేవు డతనికి ప్రత్యక్షమై వరమును గోరుమనెను.
సత్రాజిత్తు స్యమంతకమణి నిమ్మని కోరెను. సూర్యుడదే విధముగ నా మణి నిచ్చుచు నిట్లు చెప్పెను: “ఈ మణి యసాధారణమైనది. ప్రతి దినమును నిది తన తూకమంత కెనిమిదంతల బంగారము నిచ్చుచుండును. ఎవ్వడు నిర్మలుడో, ఎవ్వడు సన్మార్థుడో వాడే దీనిని ధరింపగలడు. పాతకియైన వాడు దీనిని ముట్టెనేని వెంటనే నశించును. “సత్రాజితామణిని ధరించుకొని ద్వారకకు రాగా పౌరులందఱు దాని కాంతి జూచి సూర్యుడే సమీపించెనేమో యని భ్రమించిరి.
సత్రాజిత్తు శ్రీకృష్ణుని దర్శనార్థమై యరుగగా శ్రీకృష్ణు డామణిని చాల ప్రశంసించెను. అంతట శ్రీకృష్ణు డెన్నడైన దానిని తన వద్ద నుండి యపహరించునని సత్రాజిత్తు భయపడి తన తమ్ముడగు ప్రసేనునికి దాని నిచ్చెను. ప్రసేనుడును, శ్రీకృష్ణుడును నొకనాడు వేట కరిగిరి. అనంతరము శ్రీకృష్ణుడు మాత్రమే తిరిగి వచ్చెను. ప్రసేనుడు రాలేదు. శ్రీకృష్ణుడు తన తమ్ముని సంహరించి మణినపహరించెనని సత్రాజిత్తు నిందజేయ దొడగెను. జనులు గుసగుసలాడ జొచ్చిరి. శ్రీకృష్ణుడు చాల నొచ్చికొని యడవిలో ప్రసేనుని వెదకబోయెను.
ఒకచోట ప్రసేనుడు చచ్చిపడినది జూచి యొక సింహము వీనిని జంపినట్లు జాడవలన గుర్తెఱిగి యా సింగపు జాడల వెంటపోయెను. కొంత వడికి సింహశవమును జూచెను. ఆ సింహమొక ెులుగుబంటుచే చంపబడి యుండెను. ఎలుగుబంటి జాడలను బట్టి పోవంబోవ నొక మహాగుహ యెదురయ్యెను. ఆ గుహ 800 మైళ్ల పొడవై యుండెను. అందొక మేడ యుండెను. ఆ మేడలో నొక శిశువు నిద్రించుచుండెను. ఆ శిశువు - జాంబవంతుని కుమారుడు. ఆ శిశువు యొక్క యుెు్యలపై స్యమంతకమణి కట్టబడి యుండెను. ఆ యుెు్యల నొక సుందరాంగి యూచుచుండెను. ఆ కన్యక జాంబవంతుని కూతురు. ఆమె యిట్లు పాడుచుండెను:
“ప్రసేనుని సింహము చంపెను. సింహమును జాంబవంతుడు చంపెను. కావున ఈ మణి నీదే. ఓ బాలక! యేడువ వలదు.”
శ్రీకృష్ణుడుయ్యెలను సమీపింపగా బాలిక అతనిని జూచి మోహించి, కృష్ణునితో “ఈ మణి తీసుకొని తండ్రి మేల్కాంచు లోపల పారిపొమ్మని చెప్పెను. శ్రీకృష్ణుడు నవ్వి తన శంఖమును పూరించి జాంబవంతుని యుద్ధమునకు పిలిచెను. ఇద్దఱికిని యుద్ధము 21 దినముల వఱకు జరిగెను. కృష్ణుని వెంట వచ్చిన పరివారము గుహ వెలుపల వారము దినములు నిరీక్షించి కృష్ణుడు రానందున నాతడందే మృతిచెందెనని నిశ్చయించి నగరమునుకు బోయి యా వార్త తెలిపి యాతని యంత్యకర్మల సహితము చేయించిరి.
అచ్చట గుహలో జాంబవంతుడు శ్రీకృష్ణునితో ఘోరముగబోరి తుద కోడిపోయి యా స్యమంతకమణితో గూడ తన కూతురు జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి గౌరవించెను. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సభ జేసి యందఱియెదుట మణియొక్క వృత్తాంతమును చెప్పి సత్రాజిత్తునకు దాని నిచ్చెను. సత్రాజిత్తు కూడ దా సన్యాయముగా కృష్ణుని నిందించి నందులకు సిగ్గుపడి తన కూతురగు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి పెండ్లి చేసెను.
పావము! సత్రాజిత్తు మాత్రము మణిమూలమున మృతినొందెను. శతధన్వుడనువాడా మణి నపహరించి సత్రాజిత్తును జంపెను. పిమ్మట శ్రీకృష్ణుని భీతిచే నా మణిని అక్రూరుడను వానికిచ్చి ద్వారక నుండి పారిపోయెను కృష్ణుడును, బలరాముడును వానిని వెన్నంటి చంపిరి. కాని మణిని మాత్రము కానలేదు. మరల కృష్ణుడు దాని నపహరించే ననునట్టి యపవాదమునకు పాలయ్యెను.
అక్రూరుడా మణిని దీసికొని కాశిలో దాని నుండి వచ్చు బంగారముచే దినదినము దానములు చేయుచుండెను. ఇచ్చట శ్రీకృష్ణుడు మణిదొరకనందున చాలా విచారము నొందుచుండెను. ఇట్లుండ నొకనాడు నారదుడు శ్రీకృష్ణుని సందర్శించి వారి పరితాపమునకు గారణ మరసి తెలిసికొని భాద్రపద శుద్ధ చతుర్థినాడు చంద్రుని శ్రీకృష్ణుడు చూచి యుండినందున నిందలకు పాలయ్యెనని చెప్పి యా దోషసంబంధ కథనంతయు దెలిపి వినాయకుని పూజ సేయుటకై బోధించెను. శ్రీకృష్ణుడదే విధ మాచరించి దూరునుండి విముక్తుడయ్యెను. ఇది స్యమంతకమణి వృత్తాంతము.
విఘ్నేశ్వరుడు సత్యవినాయక నామము చేత గూడ గొందఱిచే పూజింప బడుచున్నాడు. దీనిని గుఱించి బ్రహ్మాండపురాణములో వ్రాయబడియున్నది. అందు కుచేలుడు కడు దరిద్రుడై శ్రీకృష్ణుని జూడబోవ శ్రీకృష్ణుడతనితో సత్యవినాయక పూజ సేయుమని బోధించెన నియు, నతడట్లే చేసి ధనాధికుడయ్యెననియు జెప్పబడియున్నది. భాగవతము లోని కుచేలుని కథనే యించుక మార్చి పెంచి బ్రహ్మాండ పురాణములో వ్రాసియున్నారు.
విశేషాంశములు:- ఈ వినాయకుని నిజమగు తత్వమేమో యూహింప జాలము. సాధారణముగా ఇంద్రాదిదేవత లొక్కొక్క ప్రకృతితత్వమున కథిపతులుగా నుందురు. ఆ రీతిగా నాలోచించిన వినాయకుడు పురుషు లొనరించు కార్యములు నిర్విఘ్నముగా గొనసాగవలె నను తలపుతో పూజింపబడి యుండును. గుప్తే పండితు డీ వినాయకుడు పంటల దేవుడని యూహించినాడు. ఏలయన, పంటలను నాశనము చేయునట్టివి యెలుకలు, ఆ యెలుక యీతని వాహనము.
అనగా నే వస్తువును వీరులు నిర్జింతురో దానిని వాహనముగా చేసికొందురనియు, శ్రీకృష్ణుడు కాళీయసర్పము జయించినందున నందిపై స్వారీచేసెననియు, నదే విధమున నెలుకలను నాశనము చేయు వినాయకుని కెలుక వాహనమనియు నాపండితుని యభిప్రాయము. మఱియు చెప్పులు చేటలవంటివని వర్ణించుటచే చేటలు తూర్పు పట్టుటమున్నగు ధాన్య సంబంధ కార్యములలో వాడబడు చున్నందున నీయుపమానము కూడ పంటల సంబంధమైనదని వారు వ్రాసినారు.
ఏకదంతము యొక్క యర్థము నాగలిగా భావింపవచ్చు ననివారు. ఈ వాదమే నిజమని భావించిన వినాయకుని పూజావిధానములో సమర్పింపబడు పత్రపుష్ప ఫలములను గూడ నాలోచింపవలయును. అనగా ప్రకృతి యంతయు పంటలచే నుండినప్పుడి దేవుడు కొలువబడుచున్నాడు. ఈ వాదము సరియైనదో కాదో నిర్ణయింపజాలము. వినాయకుని పూజకొక ప్రత్యేక దినము పూర్వులు నిర్ణయించినట్లు కనబడదు. ఆ భాద్రపదమందుగాని, శ్రావణమందుగాని, మార్గశీర్షమందుగాని చేయవచ్చు ననుటలో నేమి సందర్భమో దురూహ్యము.
సురవరం ప్రతాపరెడ్డి
హిందువుల పండుగలు - పుస్తకం నుంచి
(తెలంగాణ సాహిత్య అకాడమీ)