calender_icon.png 19 November, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 కోట్లమందికి ఉపాధి

24-07-2024 01:35:14 AM

  • కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్

ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల రుణం

నైపుణ్యాభివృద్ధి కోసం ఐటీఐల అప్‌గ్రేడ్

ఇంటర్న్‌షిప్ అవకాశంతో పాటు ప్రతినెలా భృతి

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో యువతకు ఎన్డీయే ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే ఐదేళ్లలో 4.1 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కాలంలో యువతకు విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.

అంతేకాకుండా కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి సైతం బోనస్‌గా నెల జీతాన్ని ఇస్తామని తెలిపారు. దీనితోపాటు నైపుణ్యాభివృద్ధి పెంపునకు దేశవ్యాప్తంగా 1000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తామని, ఐదేళ్లలో కోటి మంది యువతకు 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్‌లో కనీసం రూ.5 వేల భృతి చెల్లించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. 

ఉన్నత విద్యకు రూ.10 లక్షల రుణం

ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏడాదికి లక్షల మంది విద్యార్థులకు 3 శాతం వడ్డీతో ఈ జారీ చేస్తామన్నారు. ఈ సదుపాయం దేశంలోని విద్యాసంస్థల్లో చదువుకునే వారికేనని స్పష్టం చేశారు. ఈ సదుపాయం ఏటా లక్ష మంది విద్యార్థులకు కల్పించనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మొత్తంగా విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో రూ.1.48 లక్షల కోట్లను కేటాయించారు. 

యువతకు నగదు బదిలీ..

యువతకు ఉపాధి లక్ష్యంగా మొత్తం 3 పథకాలను ప్రారంభించనున్నట్లు నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రూ.7.5 లక్షల రుణ పథకాన్ని సవరించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఏటా 25 వేల మంది యువత ప్రయోజనం పొందుతారని ఆమె ఆకాంక్షించారు. ఏదేనీ రంగంలో తొలిసారి ఉద్యోగం పొందినవారికి ఒక నెల జీతం బోనస్‌గా 3 వాయిదాల్లో ఇస్తామని నిర్మల తెలిపారు. డైరెక్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

అయితే వారి జీతం నెలకు రూ.లక్ష లోపు ఉండాలని షరతు పెట్టారు. దీని వల్ల 21 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ నిర్ణయం ఉత్పత్తి రంగంలో ఊతమిస్తుందని, తొలి నాలుగేళ్ల ఉద్యోగకాలంలో యజమాని, ఉద్యోగికి ఈపీఎఫ్ చందా ద్వారా నేరుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఫలితంగా ఈ పథకం ద్వారా ఉద్యోగాలు పొందిన 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని నిర్మల వివరించారు.