29-07-2025 12:14:49 AM
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘బార్డర్2’. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘బార్డర్’కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో జేపీ ఫిల్మ్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అప్‌డేట్స్‌ను టీమ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సినీప్రియుల నుంచి విశేష స్పందన పొందుతోంది.
ఇందులో సన్నీ డియోల్, దిల్జీద్ దోసాంజ్, నితేశ్ నిర్మల్, అహన్ శెట్టి, వినాలి భట్నాగర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్టు వెల్లడించిన మేకర్స్ ఫీమేల్ లీడ్ రోల్స్ గురించి ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే, తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందన తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. “ప్రతి కథా తన ప్రేక్షకులను కనుగొంటుంది. ‘బార్డర్2’లో వరుణ్ ధావన్ సరసన మేధా రానా నటించనుంది.
మా టీమ్‌లోకి ఆమె స్వాగతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. హీరోయిన్ మేధా స్పందిస్తూ.. “హిట్ సీక్వెల్‌లో నన్ను భాగం చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి పాత్రలు మాత్రమే చేయాలని ఎప్పుడూ హద్దులు పెట్టుకోలేదు. కొన్ని పాత్రలకే నన్ను పరిమితం చేసుకోవడం నాకిష్టం లేదు. నాకు నేను ఎలాంటి నిబంధనలూ పెట్టుకోలేదు. ప్రతి దాన్నీ ఆస్వాదించాలనుకుంటున్నా.
అది నెగెటివ్ పాత్ర అయినా, పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం అయినా నటించాలని నిర్ణయించుకున్నా. ఏ పాత్రనైనా చేయగల కళాకారిణిగా పేరు సంపాదించుకోవాలనుకుంటున్నా” అని పేర్కొంది. ‘బార్డర్’ సినిమా 1971 సంవత్సరంలో ఇండో మధ్య జరిగిన లోంగేవాలా యుద్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం రెండోభాగం ‘బార్డర్2’ను 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం ఆధారంగా రూపొందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ సినిమా 2026, జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది.