22-09-2025 05:26:52 PM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనహితమైన పనులు చేస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్లో ఆదివారం హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి నిరుపేదలను రోడ్డున పడేసారని తెలుసుకొని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సోమవారం ఆ ప్రాంతాన్ని బిజెపి నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
కబ్జాదారులను వెంటనే అదుపులోకి తీసుకొని వారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కబ్జాదారులు రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతోనే నేడు ఈ నిరుపేదలు రోడ్డున పడడానికి కారణమని ఆరోపించారు. కబ్జాలపై మొదట్లోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని ఉంటే నేడు ఈ నిరుపేదలు రోడ్డున పడే దుస్థితి ఉండేది కాదని అన్నారు.
రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతంలో కబ్జాలు జరుగుతూ ఉంటే ఆనాడు కళ్ళు మూసుకున్నారా ఇన్ని రూములు కట్టే దాకా ఎలా ఊరుకున్నారని, ఇది నిజంగా ప్రభుత్వ స్థలమే అయ్యుంటే ఇన్ని రూములు కట్టే వరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కబ్జాదారులతో కలిసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, దీనికి సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే కబ్జాదారులను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించి నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.