09-01-2026 12:04:17 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, జనవరి 8 (విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ తమ పాఠశాలల నుంచి ర్యాలీగా బయలుదేరి నిజాంసాగర్ చౌరస్తా వద్ద చేరుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు మాట్లాడుతూ రహదారి భద్రత ప్రాముఖ్యతపై ప్రసంగించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకుని తల్లిదండ్రులు, సమాజానికి కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా చేయాలని కోరారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినట్లు తెలిపారు. ఈ సంఖ్య మరింత తగ్గేలా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులు, వాహనదారులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర లేని వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
హెల్మెట్, సీట్బెల్ట్తో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తేనే ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, విద్యార్థులు,రవాణా శాఖ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.