09-01-2026 12:35:13 AM
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రవాణా శాఖా ఆద్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు
హాజరైన ఎస్పీ మహేష్ బి గీతే
రాజన్న సిరిసిల్ల, జనవరి 8(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో రవాణా శాఖా ఆద్వర్యంలో డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే హాజరయ్యారు. ఈ సందర్బంగా అధికారులు, డ్రైవర్లు, స్కూల్ విద్యార్థులు రహదారి ప్రతిజ్ఞ చేశారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఏడాది 268 ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు.
రోడ్డు ప్రమాదంతో డ్రైవర్ తోపాటు ఎదుటివారి జీవితాలు ఇబ్బంది పడుతాయని తెలిపారు. ప్రతి నెలా రోడ్డు సేఫ్టీ కమిటి మీటింగ్ ఆర్‌అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా, ఆర్టీసీ అధికారులతో సమావేశం పెడుతున్నామని, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నివారణ చర్యలు, సైన్ బోరడ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాద క్షత గాత్రులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం రహవీర్ గుడ్ సామ్రతాన్ కింద 25 వేల సహాయాన్ని అందిస్తుందని, రోడ్డు ప్రమాద బాదితులకు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల వరకు వైద్యం పొందే సదుపాయం ఉందని వెల్లడించారు.
డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ వాడొద్దు
డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి డ్రైవర్ ఫోన్ వినియోగించవద్దని ఎస్పీ మహేష్ బీ గితే సూచించారు. అపరిచిత డ్రైవర్లు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. స్కూల్ ఆటోలు, బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని స్పష్టం చేశారు. ఎక్కువ ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తోనే అవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ టైడ్స్ ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా సిములేటర్ పై ఎస్పీ కూర్చుని దాని వినియోగం తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఇంజిన్, ఇతర వాహనాల విడిభాగాల వినియోగం తదితర దురై మురుగన్ వివరిం చారు. కార్యక్రమంలో రవాణా శాఖా అధికారి లక్ష్మన్, ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనా థ్, ఆర్‌అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, డిపో మేనేజర్లు ప్రకాశ్‌రావు, శ్రీనివాస్, ఎంవీఐ వంశీధర్, ఏ ఎంవీఐలు రజనీదేవి, పృధ్వీరాజ్ పాల్గొన్నారు.