03-01-2026 01:28:12 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
పాల్గొన్న ఎస్పి నితికాపంత్, ఏఎస్పీ చిత్తరంజన్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సబ్ జైలు, పోలీస్ స్టేషన్, కె.బి. చౌక్ మీదుగా బస్టాండ్ వరకు సాగి, తిరిగి కె.బి. చౌక్ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ నితికా పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ పోలీస్ సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కీలకమని అన్నారు.
హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు.రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను పోలీస్ శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అనేక విలువైన ప్రాణాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజల భద్రత, రక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజమల్లు, ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కాగజ్‌నగర్ టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్, ఆర్.ఐలు అంజన్న, విద్యాసాగర్, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.