calender_icon.png 5 January, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నోత్తరాల్లో సీఎం సుదీర్ఘ ప్రసంగం విరుద్ధం

04-01-2026 12:35:05 AM

  1. సీఎంని విమర్శిస్తే మైక్ ఇవ్వబోమని చెప్పడమేంటి
  2. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదని, ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ గంటన్నర పాటు మాట్లాడడం శాసనసభ నిబంధనకు విరుద్ధమని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా స మావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని చెబుతూనే.. ముసీ ప్రక్షాళనకు వేల కోట్లు ఎట్లా ఖర్చు చేస్తారని హరీశ్‌రావు అడిగితే సీఎం రేవంత్ సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడారన్నారు.

సీఎం స్థాయిలో ఉండి గంటన్నర పాటు బీఆర్‌ఎస్ సభ్యులపై అసభ్యంగా మాట్లాడటం దారుణమని విమర్శించారు. స్పీకర్ అడ్డు చెప్పకుండా.. ప్రతి పక్షాలకు అవకాశం కల్పించకుండా చేయడం అన్యాయమన్నారు. సీఎం తప్పులను ఎత్తిచూపేందుకు మైక్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడేందుకు కనీసం అవకాశం కల్పించడం లేదని, అందుకే సమావేశాలు బహిష్కరించామని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ తీరు బాధాకరమని, స్పీకర్ పక్షపాత వైఖరితో ఉండొద్దన్నారు.

‘ముఖ్యమంత్రికి ఎలాంటి హక్కు ఉంటుందో మాకూ అదే హక్కు ఉంటుందన్నారు. సీఎం ఏదో గిల్లిగజ్జాలు పెట్టాలని చూశారని, మమ్ములను తిట్టేందుకు మాత్రమే నిన్న సభకు వచ్చారు’ అని విమర్శించారు. ముఖ్యమంత్రికి భజన చేయాలా, స్పీకర్ స్వయంగా సీఎంని విమర్శిస్తే మైక్ ఇవ్వబోమని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. స్పీకర్ బీఆర్‌ఎస్ సభ్యుల గొంతు నొక్కేందుకు పనిచేస్తున్నారని విమ ర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్, మాధవరం కృష్ణరావు, డాక్టర్ సంజయ్, కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, విజయుడు పాల్గొన్నారు.