15-05-2025 11:03:21 PM
కొండపాక: ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా చేయాలని కుక్కునూరు పల్లి మండల్ ఎంఈఓ బచ్చలి సత్తయ్య(MEO Bachali Sathaiah) అన్నారు. కుక్కునూరు పల్లి ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ కార్యక్రమంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బచ్చలి సత్తయ్య మాట్లాడుతూ.. సమాజంలోని అందరికీ చదవడం, రాయడంలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని దీనిలో మనమంతా కలిసి అన్ని వయసుల వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సమాజ అభివృద్ధికి పునాది అక్షరాస్యత సంఖ్యా శాస్త్రాలపై దృష్టి సారించాలన్నారు. ఉల్లాస్ అనేది అందరికీ జీవితకాల అభ్యాసం అని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో పదవ తరగతి వరకే చదివి మధ్యలో ఆపివేసి పై చదవులు చదువుకోలేని వారికి ఓపెన్ స్టడీ సిస్టంలో పూర్తి చేయవచ్చని ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా సహకారం అందించాలని సూచించారు. ఈనెల 25 వరకు గ్రామాల్లో సర్వే చేసి జాబితాను సిద్ధం చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని, గ్రామాలలో ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్న వారికి నచ్చజెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నడుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏపీవో, మహిళా సంఘం సభ్యులు, సీసీలు, వివోలు ఏఏపిసి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.