calender_icon.png 29 August, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ అప్రమత్తంగా ఉండాలి

29-08-2025 04:01:20 AM

  1. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 
  2. సీ.పీ సాయి చైతన్య తో కలిసి వరద ఉద్ధృతిపై సమీక్ష 

నిజామాబాద్ ఆగస్టు 28: (విజయ క్రాంతి):  రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంచనీయ సంఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉదయం నుండి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయాయి, ముంపునకు గురైన నివాస ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయి అధికారులకు తక్షణ సహాయక చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

వరద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు, తండాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.  రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావాలని కలెక్టర్ హితవు పలికారు.

ఈ మేరకు అన్ని నివాస ప్రాంతాలలో టాంటాం, మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.  కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు వరద పరిస్థితిపై సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు.   సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.