calender_icon.png 26 January, 2026 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించాలి

26-01-2026 12:45:08 AM

కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, జనవరి 25(విజయక్రాంతి):యువతే దేశ భవిష్యత్తు అని ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంగారెడ్డి స్థానిక ఐబీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు విద్యార్థులు, అధికారులు, కళాకారులు, ఉద్యోగులు, యువత తదితరులతో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ఓటు వినియోగం ఎంత కీలకమో ప్రజలకు అవగాహన కల్పించేందుకే జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. సక్రమమైన ఓటరు జాబితాతోనే పారదర్శక ఎన్నికలు సాధ్యమవుతాయని, అప్పుడే సరైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ విషయమై చుట్టుపక్కల వారిలో అవగాహన కల్పించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కేవలం 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే ఉందని, అర్బన్ ఓటర్లలో ఓటు హక్కు వినియోగంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ పారదర్శక ప్రజాస్వామ్యానికి ఓటు వేయడం తప్పనిసరి అని అన్నారు.

ఓటు ఒక వజ్రాయుధమని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన నాయకున్ని ఎన్నుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ జ్యోతి, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, అఖిలేష్ రెడ్డి,రామాచారి,జగదీష్, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, డీఎం అండ్ హెచ్వో వసంత్ రావు, తహసిల్దార్, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.