09-08-2025 01:05:42 AM
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, ఆగస్టు 8 : పర్యావరణ పరిరక్షణకు ఆయువు పట్టు అయిన వృక్ష సంపదను పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. మన ఇప్పుడు నాటే ప్రతి మొక్క రేపటి తరానికి భరోసాను కలిగిస్తుందని వెల్లడించారు. శుక్రవారం కాటేదాన్ వెంకటేశ్వరకాలనీలో గల ఆదిత్య హైస్కూల్లో నిర్వహించిన ’వన మహోత్సవం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే ప్రతి పౌరుడు మొక్కలు నాటాలన్నారు. సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మన భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు విద్యార్థులకు మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.
ఈ మేరకు పాఠశాల చైర్మన్ ఉస్కెమూరి నిరంజన్, కరస్పాండెంట్ సంకూరి జయప్రకాష్, డైరెక్టర్లు అనితా రామకృష్ణ, వి. శిరీష, ప్రిన్సిపల్ ఎనగాండ్ల కృష్ణారెడ్డి తదితరులతో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాంతాల పెద్దలు ఎద్దుల మాదవరెడ్డి, సుధాకర్ గౌడ్, కళ్లెం అంజయ్య, ఎస్. స్వామి గౌడ్, అంజనీగౌడ్, మైలార్దేవ్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. ధనంజయ్, బిఆర్‌ఎస్ నాయకుడు కొంపల్లి జగదీష్, స్థానికులు గోపాల్, రాము, గోపి తదితరులు పాల్గొన్నారు.