18-11-2025 04:48:06 PM
కమిషనర్ రమేష్... ఎంఈఓ రాజయ్య
సుల్తానాబాద్ (విజయక్రాంతి): మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సుల్తానాబాద్ మునిసిపల్ కమిషనర్ రమేష్, మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్యలు పిలుపునిచ్చారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ టి. రమేష్ ఆధ్వర్యంలో “నషా ముక్త భారత్ అభియాన్ (ఎన్ ఎం బి ఏ )” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు దేశాన్ని మాదక ద్రవ్యాల బెడద నుండి దూరంగా ఉంచి “డ్రగ్స్ ముక్త భారత్*”గా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్‌పీలు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో నెహ్రూ చౌక్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ అనంతరం, పాల్గొన్న వారందరికీ “మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ” చేయించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రమేష్, ఎంఈఓ రాజయ్య లు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని, ముఖ్యంగా 25 సంవత్సరాలలోపు ఉన్న యువత డ్రగ్స్ బారిన పడకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కొనుగోలు, అమ్మకం, వినియోగం అక్రమ రవాణా వంటి అంశాలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. అదేవిధంగా, డ్రగ్స్ బారినపడిన వారిని పునరావాసం కోసం ప్రభుత్వము అందిస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 14446 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే “నషా ముక్త భారత్ అభియాన్” ప్రధాన లక్ష్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అలీమోద్దీన్, ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ రత్నాకర్ రెడ్డి, మెప్మా సిఓ స్వరూప, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్‌పీ లు పాల్గొన్నారు.