11-10-2025 06:47:12 PM
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధం అవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతీ ఒక్కరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులిస్తూ, ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, ఆ దిశగా వ్యూహాత్మకంగా పని చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. జుక్కల్ఎల్ ఓ సి నియోజకవర్గంలో 20 నెలల్లో సుమారు రూ. 9 కోట్ల విలువ చేసే ఎల్ఓసి మంజూరు చేశామని, పేదల సంక్షేమం, ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.