calender_icon.png 9 October, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగజీవాలకు సేవ.. అయినా వేతనాలు రావా!

09-10-2025 12:00:00 AM

  1. గోపాలమిత్రల గోడు వినేదెవరు.. గోస తీర్చేదెవరు..
  2. కుటుంబ పోషణకు భారమై ఇబ్బందులు పడుతున్న వైనం
  3. కనీస వేతనం అందించాలని వేడుకోలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 8: పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే గోపాలమిత్రలు నేడు కనీస గౌరవ వేతనం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తూ అత్యవసర సమయాల్లో 365 రోజులపాటు పశు వైద్యాధికారుల సూచనల మేరకు సేవలందిస్తూ 6 నెలలుగా కనీస గౌరవ వేతనం లేక కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.

కనీస బస్సు సౌకర్యం లేని పల్లెల్లో పాడి పరిశ్రమ అభివృద్దే ముఖ్యమని భావించి,రైతు పెంచుకుంటున్న నాటు జాతి పశువులని,రైతుకు ఎలాంటి కష్టం జరగకుండా వారి ఇంటి ముంగిట్లో కెళ్ళి నాటుజాతి పశువులకు కృత్రిమ గర్భాధారణ చేసి అధిక పాలనిచ్చే మేలు జాతి దూడలను పుట్టించడం కోసం గోపాలమిత్ర వ్యవస్థను 2000సంవత్సరంలో అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

వారి సేవలను మెచ్చిన వైయస్సార్ ప్రభుత్వం మొదటిసారిగా గోపాల మిత్రులకు 2007సంవత్సరంలో కనీస గౌరవ వేతనంగా రూ.1200 ప్రకటించడం జరిగింది. నాటినుండి గోపాల మిత్రులకు కృత్రిమ గర్భాధారణతో పాటు పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత అతిగా ఉండటం వల్ల వీరికి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం మండల వైద్యాధికారికి,రైతులకు అనుసంధానకర్తగా ఏర్పరచి అత్యంత ప్రమాదకరమైన బ్రూ సెల్లాసిస్ మరియు ఆంత్రాక్స్ వ్యాక్సిన్ తో పాటు గాలికుంటు టీకాలు,జబ్బ వాపు టీకాలుతో పాటు సన్న జీవాలైన గొర్రెలు,

మేకలకు నట్టల నివారణ మందు కార్యక్రమంలో పశు వైద్య సిబ్బందితో పాటు గోపాలమిత్రులు పాల్గొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ రైతులకు గడ్డి పెంపకంపై అవగాహన కల్పిస్తూ రైతులను చైతన్యవంతులుగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు.ఆనాటి నుండి నేటి వరకు కృత్రిమ గర్భాదారణ చేసిన దూడలు గేదలై నేడు రైతుకు ఎనిమిది లీటర్ల స్వచ్ఛమైన పాలను అందిస్తూ రైతుకు తోడ్పాటునందిస్తున్నాయి.అలాంటి గోపాల మిత్రలు కొన్ని నెలలుగా కనీస వేతనాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

దీంతోపాటు ప్రభుత్వం నుండి పర్మినెంట్ చేయడం కోసం ఎలాంటి అనుమతులు రాక, బడ్జెట్ ఉన్న వేతనం పొందక నరకయాతన అనుభవిస్తున్నారు. పాలకులు మారిన ఇంతవరకు తమ గోడు వినేవారు లేరని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి పడిన గోపాల మిత్రుల గౌరవ వేతనాన్ని విడుదల చేసి, ఉద్యోగ భద్రత కల్పిం చాలని గోపాలమిత్రలు  కోరుతున్నారు.

కనీస వేతనం రూ.24 వేలు అందించాలి 

అర్హత కలిగిన గోపాల మిత్రులను పశుసంవర్ధక శాఖలో ఓఎస్ గా నియమించాలి. కనీస వేతనం రూ.24వేలు అందించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.ప్రతినెల వేతనాన్ని జిల్లా, మండల పశువైద్యాధికారులచే ఇప్పించాలి. ప్రతీ గోపాలమిత్ర కుటుంబానికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి.

- ఆల్దాస్ లింగయ్య,  గోపాలమిత్ర అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట