09-10-2025 12:00:00 AM
--908.15 కోట్ల రూపాయలు కేటాయింపు
-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు
-260 ఎకరాల స్థలం గుర్తింపు
మహబూబాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో వరంగల్ మహబూబాబాద్ స్టేషన్ల మధ్య రైల్వే నిర్వాహణ, సదుపాయాల విస్తరణ కోసం కొత్తగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలో పిరియాడికల్ ఓవర్ హాల్ మెగా మెయింటెనెన్స్ డిపో (పిఓహెచ్) ఏర్పాటుకు 908.15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిఏంఈ ఉత్తర్వులు జారీ చేశారు.
దేశంలో ప్రథమం
మహబూబాబాద్ ప్రాంతంలో రైల్వే శాఖ ఏర్పాటు చేయనున్న మెగా మెయింటెనెన్స్ డిపో దేశంలో ప్రధమమని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఒకే చోట పిఓహెచ్, ఆర్‌ఓహెచ్, సిక్ లైన్, ట్రైన్ ఎగ్జామినేషన్, సౌకర్యాల పరిశీలన, ఫ్లైట్ రోలింగ్ స్టాక్ విభాగాలతో అంబరిల్లా వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నారు.
వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి
మహబూబాబాద్ జిల్లాలో పి ఓ హెచ్ మెగా అంబరిల్లా వర్క్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మందికి పైగా ఉపాధి లభించనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బోగీల మరమ్మత్తు, ఇతర విడిభాగాల ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి తొలి అడుగు పడిందని చెబుతున్నారు. దక్షిణాది, ఉత్తరాదిని కలిపే కాజీపేట రైల్వే జంక్షన్ కు సమీపంలో పి ఓ హెచ్ ఏర్పాటు వల్ల రైల్వే శాఖ రవాణా, విస్తరణకు దోహదపడుతుందని చెబుతున్నారు.
ఫలించిన నేతల కృషి
మానుకోట ప్రాంతంలో రైల్వే పిఓహెచ్ ఏర్పాటు కోసం వివిధ పార్టీల నేతలు చేసిన కృషి ఫలించింది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు మానుకోటలో పిఓహెచ్ ఏర్పాటు కోసం 2024 నుండి కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. దీనికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో రైల్వే శాఖ పిఓహెచ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, నిధులను కేటాయించడం జరిగిందని చెప్పవచ్చు.
260 ఎకరాల స్థలం గుర్తింపు. మరో 40 ఎకరాల అవసరం
మానుకోట జిల్లా కేంద్రానికి సమీపంలో రైల్వే పిఓహెచ్ నిర్మాణానికి అవసరమైన 300 ఎకరాల భూమిలో 260 ఎకరాల భూమిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరో 40 ఎకరాల భూమి అవసరమని చెబుతున్నారు. మొత్తం 300 ఎకరాల భూమి పిఓహెచ్ ఏర్పాటుకు అవసరమని రైల్వే శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. దీనితో ఇటీవల స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రంలో కీలక పదవిలో ఉన్న జిల్లాకు చెందిన నేత, జిల్లా అధికారులు సైతం సానుకూలత వ్యక్తం చేస్తూ అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి తమ వంతు తోడ్పాటు అందించడానికి ముందుకు వచ్చారు. 300 ఎకరాల భూమిని గుర్తించి పూర్తిస్థాయిలో హద్దులు నిర్ణయించి రైల్వే శాఖకు అప్పగిస్తే, పి ఓ హెచ్ నిర్మాణ పనులకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టనుంది.