19-09-2025 12:34:31 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట (మెదక్), సెప్టెంబర్ 18 (విజయక్రాంతి):జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ’స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలోని పిహెచ్సిలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని పరిశీలించి, వైద్య సౌకర్యాలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమం అని అన్నారు.
మహిళలు తమ కుటుంబం బాగుండాలని నిరంతరం సేవలందిస్తూ తన ఆరోగ్యంపై అశ్రద్ధ చూపుతున్నదని, అటువంటి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేస్తూ స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ కు రూపకల్పన చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు ప్రతి వైద్య కేంద్రంలోనూ నిరంతరం సేవలందించనున్నట్లు తెలిపారు.
అనంతరం కలెక్టర్ మెదక్ మండలం మంభోజిపల్లిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న పరిసరాలను, వంటశాలను, వాటర్ సౌకర్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న అనేక రకాల శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.