calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలం చెల్లిన కల్యాణలక్ష్మి చెక్కులు!

26-09-2025 01:19:12 AM

  1. అధికారుల నిర్లక్ష్యంతో 36 మంది లబ్ధిదారులకు పంపిణీ.  
  2. బ్యాంకుకు వెళ్లగా చెల్లదంటూ తిరస్కరణ.                           
  3. ఉసూరుమంటూ వెనుదిరిగిన లబ్ధిదారులు

నాగారం, సెప్టెంబర్ 25 : అధికారుల  నిర్లక్ష్యం  కారణంగా చెల్లని చెక్కులను పంపిణీ చేసి మండలంలో పలువురు లబ్ధిదారులను ఆందోళనకు గురిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో నవ్వుల పాలయ్యాయి. తాసిల్దార్, రెవిన్యూ అధికారులు చెక్కులపై వేయబడిన డేటును చూసుకోకుండానే ఆర్భాటకంగా  స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు చేతుల మీదుగా  నాగారం మండల విద్యా వనరుల అధికారుల భవనంలో  గురువారం  చెక్కులను పంపిణీ చేశారు.

దీనిలో నాగారం మండలానికి మంజూరైన 36, చెక్కులను, జాజిరెడ్డిగూడెం మండలానికి మంజూరైన 09 చెక్కులను ఒకే చోట పంపిణీ కార్యక్రమం నిర్వహించగా  అధిక సంఖ్యలో నాయకులు, లబ్ధిదారులు ,ప్రజలు హాజరైనారు. పంపిణీ అనంతరం చెక్కులు మంజూరైన మహిళలు ఆనందంతో బ్యాంకుకు   తీసుకువెళ్లి  డబ్బును తమ ఖాతాలో జమ చేయాలని అడుగగా చెక్కుపై 13/06/2025  చూసి  బ్యాంకు అధికారి ఈ చెక్కు కాలం  చెల్లిoదని సావు కబురు చల్లగా చెప్పాడు.

అప్పటివరకు ఆనందంగా ఉన్న మహిళల ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. పండుగకు డబ్బులు వస్తాయి అనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. దీంతో చేసేదేం లేక పలువురు లబ్ధిదారులు చెక్కులు తీసుకుని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇచ్చారు. అయితే నాగారం మండలానికి సంబంధించిన 36 చెక్కులు మాత్రమే కాలం చెల్లాయని,  జాజిరెడ్డిగూడెం మండలానికి సంబంధించిన తొమ్మిది చెక్కులు చెల్లుబాటు అయ్యే విధంగా ఉన్నాయని తెలిపారు.

నాగారం తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల పనికి  ఇదే నిదర్శనం అంటూ పలువురు అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు చిన్న చూపు కలుగుతుందని అటువంటి అధికారులపై ఉన్నత అధికారులు  తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు , కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కోరుతున్నారు. 

గడువు ముగిసిన మాట వాస్తవమే. 

కళ్యాణ లక్ష్మి చెక్కులపై వచ్చిన తేదీ గడువు ముగిసినది  వాస్తవమే. పంపిణీ చేసిన చెక్కులను తీసుకొని వాటిని,  పంపించి వాటి స్థానంలో నూతన చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తాము. లబ్ధిదారులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు.

హరికిషోర్ శర్మ, తాసిల్దార్, నాగారం.