22-01-2026 02:07:47 PM
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్-భటాపారా జిల్లాలో(Balodabazar-Bhatapara) ఒక స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు కార్మికులు సజీవ దహనం కాగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. భటపారాలోని బకులాహి గ్రామంలో ఉన్న రియల్ ఇస్పాత్ అండ్ పవర్ లిమిటెడ్‌లో బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలిపోవడంతో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగిన సమయంలో, కార్మికుల బృందం కొలిమి ప్రాంతం చుట్టూ శుభ్రపరిచే పనులు చేస్తోంది. ఘటనా స్థలం నుండి పది మందికి పైగా వ్యక్తులను రక్షించారు. వారిలో ఆరుగురు గాయాల కారణంగా మరణించారు.
మిగిలిన వారిని వైద్య సహాయం కోసం వెంటనే భటపారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని బిలాస్‌పూర్‌కు రెఫర్ చేశారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.