09-10-2025 12:00:00 AM
తూప్రాన్, అక్టోబర్ 8: మెదక్ జిల్లా ఎస్పీడి.వి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా బస్ స్టేషన్, దాబాలు, హోటళ్లు, పాన్ షాపులతో పాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో యాంటీ సబోటేజ్, నార్కోటిక్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ బృందాలు పాల్గొని ప్రతి మూలను పరిశీలించాయి. ప్రజల భద్రతను కాపాడటం, నేరాలను అరికట్టడం అలాగే అక్రమ మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు 24 గంటలు ప్రజల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, ప్రజల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఎస్‌ఐ జ్యోతి, ఏఎసై శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ శ్రావణ్, బాంబ్ స్క్వాడ్ సిద్దిరాములు, సిబ్బంది పాల్గొన్నారు.