18-12-2025 12:14:22 AM
విధులు పక్కనపెట్టి డైరీ యాడ్స్ వేటలో రెవెన్యూ అధికారులు
మెజిస్ట్రేట్ స్థాయి అధికారి నేరుగా వస్తుండడంతో తలలు పట్టుకుంటున్న వ్యాపారులు
తాండూరు, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ప్రతి ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ఆయా శాఖలల్లో ని ఉద్యోగ సంఘాలు కొత్త డైరీలను ఆవిష్కరించుకోవడం పరిపాటి. అందుకు అవసరమైన యాడ్స్ నిధులను ఆయా సంఘాల వారే స్వతగా సమకూర్చుకోవడం చూస్తుం టాం. కానీ వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్తరకం వసూళ్లకు రెవెన్యూ అధికారులు తెర లేపారు.
నూతన సంవత్సరం డైరీ లో యాడ్స్ ఇవ్వాలని జిల్లాలోని ఓ తాసిల్దార్ వ్యాపారస్తులను ఆశ్రయించడం విమర్శలకు తావిస్తోంది. పెద్దముల్ మండల తాసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ తాను తాసిల్దార్ సంక్షేమ సంఘం ప్రతినిధినని నూతన సంవత్సర డైరీ ముద్రించడం కోసం యాడ్ వేసేందుకు 30 వేల రూపాయలను ఇవ్వండి అంటూ...డిప్యూటీ తాసిల్దార్ మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో కలిసి వెళ్లి వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు.
బుధవారం విధులను పక్కనపెట్టి పెద్దముల్ గ్రామ శివారులో ఉన్న సాయిబాబా కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్, సి సి ఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రతినిధులను కలిసి యాడ్స్ కోసం 30 వేల రూపాయలు అడిగారు. అయి తే అందుకు సమాధానంగా వ్యాపార ప్రతినిధులు తమ వ్యాపార భాగస్వాములను చర్చించి నిర్ణయిస్తామని చెబుతూ అధికారుల తీరుపై పెదవి విరుస్తున్నారు.
అధికారులు కొత్త డైరీల యాడ్స్ పేరుతో కాటన్ మిల్లులోనే కాకుండా పెద్దపెద్ద వ్యాపారస్తులను ఆశ్రయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ పనులపై కార్యాలయానికి వచ్చిన ప్రజల కు అందుబాటులో ఉండకుండా అధికారులు వసూళ్ల దారి పట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.