27-08-2025 12:18:41 AM
మణికొండ, ఆగస్ట్26 : నెక్నాంపూర్ చెరువు వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ ఛైర్మన్ కొండకళ్ల నరేందర్ రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం మున్సిపాలిటీ నాయకులతో కలిసి చెరువును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణనాథులను నిమజ్జనానికి తరలించే భక్తుల కు చెరువు వద్ద క్రేన్లు, లైటింగ్, అత్యవసర సిబ్బందితో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.
నిమజ్జనం పూర్తయ్యాక, చెరువులోకి డ్రైనేజీ నీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మురుగునీటిని నేరుగా మూసీలోకి మళ్లించి, చెరువులో కేవలం వర్షపునీరు మాత్రమే నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ స్వామి, బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.