09-11-2025 12:02:22 AM
చుట్టూ గోదారమ్మ పరవళ్లు, పచ్చని ప్రకృతి సోయగాలు, కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులతో గిలిగింతలు పెట్టే చలి గాలులు. కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, అంతే అంద మైన సూర్యాస్తమయం. రాత్రిళ్లు వెదురు గుడిసెలలో బస. మధ్యలో క్యాంప్ ఫైర్. గోదారమ్మ ఒడిలో స్నానం. ఇవి పాపికొండల ప్రత్యేకతలు. జీవితాంతం గుర్తుండి పోయే జ్ఞాపకాల మధుర అనుభూతుల సమ్మేళనమే గోదారి నదీ అలలపై సాగే లాంచీ ప్రయాణం పాపి కొండల విహారయాత్ర.
మారాసు సుధీర్, మణుగూరు, విజయక్రాంతి : తూర్పు గోదావరి జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడ చక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుంది. ఎక్కడో మమారాష్టల్రోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదుల్లో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు.
పరవశింపజేసే పాపికొండలు...
తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం నలు మూలల నుంచి వచ్చే పర్యాటకులను పాపికొండలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రాలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో విస్తరించిన కొండలే పాపికొండలు. ఈ కొండల మధ్య గోదావరి వయ్యారంగా ప్రవహిస్తోంది. ఈ రెండు జిల్లా భూభాగాల్లో పాపిడిలా ప్రవహించే గోదావరి ప్రవాహంతో వీటికి పాపిడికొండలు అని పేరు వచ్చింది. కాలక్రమంలో వీటిని పాపికొండలు అని పిలుస్తున్నారు.
మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. కొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకార ఆలయం. ఫల వృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండ రెడ్ల గిరిజనుల అప్యాయత ఆధరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది.
ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యాటకులను పర వశింపజేసే పాపికొండలు దర్శనమిస్తాయి. భద్రాచలం వద్ద సుమారు 2 కిలో మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపికొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎతైన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు.
యాత్ర సాగేదీలా..
భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి దర్శనం తర్వాత భద్రాచలం నుంచి 72 కి.మీ ల దూరంలో పోచవరం దగ్గర బోటింగ్ పాయింట్‌కు ఉదయం పర్యాట కలు బయలుదేరుతారు. ఇక్కడ నుంచి 21లాంచీలు విహార యాత్రకు తీసుకెళ్తా యి. పోచవరం బోటింగ్ పాయింట్ దగ్గర బయలుదేరిన డబుల్ ఇంజన్ల లాంచీ పాపికొండలు దాటాక వచ్చే సిరివాకకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి పోచవరానికి వస్తుంది.
లాంచీలో గోదావరి, పాపికొండలు, ఆదివాసీల చరిత్రను తెలియ జేసే గైడ్స్ ఉంటారు. టూరిస్టులను ఉత్సాహపరిచేందుకు కొందరు ఆదివాసీ యువకులు డ్యాన్స్, పాటల ప్రోగ్రాంలు బోట్లో నిర్వహిస్తారు. పోచవరం గోదావరి ఒడ్డున లాంచీలలోకి ఎక్కి విహార యాత్రకు వెళ్లిన ప్రయాణికులు మళ్లీ అక్కడికే రావాల్సి ఉంటుంది.
ఆరు నెలల పాటు సాగనున్న విహార యాత్ర
జూలై నుంచి ఇటీవల వరకు గోదావరి వరదల కారణంగా పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదల కాలం పూర్తికావడంతో పాపికొండల పర్యాటక యాత్రను పునరుద్ధరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పాపికొండ యాత్రకు వెళ్లేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతం నుంచి పాపికొండల యాత్రకు వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ పర్యాటక వెబ్ సైట్లో బోటింగ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టికెట్ ధర నిర్ణయించగా భద్రాచలం నుంచి ఏపీలోని వరరామచంద్రపురం మండలం పోచారం వరకు వాహనం లో ఒక్కొక్కరిని తీసుకెళ్లి, తీసుకొచ్చేందు కు రూ.300 చెల్లించాల్సి ఉంటుందని స్థానిక నిర్వాహకులు తెలిపారు.
భద్రాచలం కేంద్రంగా పలువురు ఏజెంట్ల వద్ద టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఆసక్తి గలవారు పాపికొండల విహార యాత్ర టికెట్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఈ విహారం సాహసంతో పాటు ప్రశాంతతను కూడా అందిస్తోంది. పర్యాటక శాఖ పర్యాటకులను ఆహ్వానిస్తూ, ఈ సీజన్ లో పాపి కొండల యాత్రకు హాజరై ఆ అనుభూతిని ఆస్వాదించాలని సూచించింది.