calender_icon.png 14 November, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

14-11-2025 12:00:00 AM

  1. రూ.4.75 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం
  2. 8 మంది నిందితుల అరెస్ట్
  3. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ప్రింటింగ్
  4. మెహిదీపట్నంలో మార్చుతుండగా పట్టివేత
  5. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసి, 1:4 నిష్పత్తిలో కస్టమర్లకు నకిలీ నోట్ల సరఫరా

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి)/తాండూర్: వికారాబాద్ జిల్లా తాం డూర్ కేంద్రంగా నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, హైదరాబాద్ నగరంలో చెలామణి చేస్తున్న అంతరాష్ర్ట ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గురువారం మెహిదీపట్నం పోలీసులు, సౌత్-వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందా లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 8 మంది నిందితు లను అరెస్టు చేసి, వారి నుంచి రూ.4.75 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

మెహిదీపట్నం, ఫస్ట్ లాన్సర్ వద్ద గల ఈద్గా మైదానంలో గురువారం నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడి చేసి, ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.4.75 లక్షల నకిలీ కరెన్సీ, కారు, మూడు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో దందా

ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి కస్తూరి రమేష్ బాబు(35)గా గుర్తించారు. ఇతను తన సోదరి రామేశ్వరితో కలిసి తాండూర్‌లోని తన ఇంట్లో నకిలీ నోట్లను ప్రింట్ చేస్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. అసలు నోటును స్కానర్‌తో స్కాన్ చేసి, ఫొటోషాప్‌లో ఎడిట్ చేసి, జేకే బాండ్ పేపర్‌పై ప్రింట్ చేసేవాడు. ఆ తర్వాత, గిఫ్ట్ ప్యాకింగ్ పేపర్‌తో గ్రీన్ సెక్యూరిటీ థ్రెడ్‌ను తయారు చేసి, ఫెవికాల్‌తో అతికించి, హీట్ గన్‌తో ఆరబెట్టి అచ్చం అసలు నోట్లలా కనిపించేలా తయారుచేసేవాడు.

ఈ నకిలీ నోట్లను చెలామణి చేయడానికి రమేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకున్నాడు. నకిలీ నోట్ల వీడియోను పోస్ట్ చేసి, తన ఫోన్ నంబర్‌ను కామెంట్ బాక్స్‌లో ఉంచేవాడు. దీని ద్వారా అబ్దుల్ వాహిద్, తాహా అనే యువకులు అతడిని సంప్రదించారు. ఒక అసలు నోటుకు నాలుగు నకిలీ నోట్ల (1:4) నిష్పత్తిలో వీరికి సరఫరా చేసేవాడు. వారు ఈ నోట్లను ఇతరులకు 1:3, 1:2 నిష్పత్తులలో అమ్ముతూ కమీషన్ పొందేవారు.

గతంలోనూ అనేక కేసులు

ప్రధాన నిందితుడు రమేష్ బాబు, అతని సోదరి రామేశ్వరిపై గతంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్, హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, గోపాల్‌పురం పోలీస్ స్టేషన్లలో నకిలీ కరెన్సీ కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కారు మెకానిక్, ఏసీ టెక్నీషియన్, సేల్స్‌మెన్‌లతో పాటు ఒక బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కూడా ఉన్నాడు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని సౌత్-వెస్ట్ జోన్ డీసీపీ జి చంద్ర మోహన్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారు లను, సిబ్బందిని డీసీపీ అభినందించారు.