14-10-2025 12:57:29 AM
- 300 ఎకరాల్లో పంట దిగుబడిపై ప్రభావం
- కోదాడ దుకాణాల్లో కొనుగోళ్లు
-ముందుగా ఈనినవన్నీ దొడ్డురకమే
-సమస్య పరిష్కారం కోసం రైతుల ఎదురుచూపులు
కోదాడ, అక్టోబర్ 13: మండలంలోని కూచిపూడి గ్రామంలోనీ రైతులను సన్న రకం వరి విత్తనాల్లో కల్తీ విత్తనాలు వచ్చి కలవర పెడుతున్నాయి. రైతులు కష్టపడి పండిస్తున్న పంట ఈత దశలో కల్తీ విత్తనాల విషయం బయటపడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని సుమారు 150 మంది రైతులు కోదాడ పట్టణంలోని పలు దుకాణాల వద్ద సన్నరకం వరి విత్తనాలు కొనుగోలు చేసి 300 ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు పొట్టదశకు రావడంతో ముందుగా ఈతకు వచ్చినవన్నీ దొడ్డురకం కావడంతో రైతులు విషయాన్ని దుకాణాదారుల దృష్టికి తీసుకెళ్లారు.
సంబంధిత దుకాణాదారులు కంపెనీ డీలర్లకు విషయం చెప్పడంతో శనివారం పంట పరిశీలనకు ఆయా కంపెనీల డీలర్లు వచ్చారు. న్యాయం చేయాలని కోరితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపిస్తూ రైతులు వాగ్వివాదానికి దిగారు. కల్తీ వరి విత్తనాలు అంటగట్టి, తమను మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడకు చెందిన ముగ్గురు విత్తన దుకాణాదారులకు, సంబంధిత డీలర్లకు గతం వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ విధంగా బెరుకులు రావడంతో ఎకరానికి 5 బస్తాల దిగు బడిపై ప్రభావం పడుతుందన్నారు. అధికారులకు గత రెండు సంవత్సరాలుగా కల్తీ విత్తనాల గురించి చెబుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ వరి విత్తనాలు సాగుచేసిన రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు శిరంశెట్టి రామారావు డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు అమ్మిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ కాదు బెరుకులు మాత్రమే
కూచిపూడి గ్రామంలో నకిలీ విత్తనాలు అనడంతో హుటాహుటిన వరి పొలాలను పరిశీలించాము. నకిలీ విత్తనాలు కాదు అవి బెరుకులు మాత్రమే. సుమారు 74 ఎకరాలు వరి పంట కొంతమేర నష్టం వాటిల్లవచ్చు. శాస్త్రవేత్తలను తీసుకొని వస్తామంటే రైతులు ఒప్పుకోవడం లేదు. తప్పకుండా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాము.
రజినీ, మండల వ్యవసాయ అధికారి, కోదాడ
ఎకరానికి 5 బస్తాల దిగుబడి తగ్గుతుంది
కూచిపూడి గ్రామంలో 13 ఎకరాల భూమిలో సన్నరకం వరి సాగు చేసేందుకు రూ.15 వేలు పెట్టి 13 బస్తాలు కొనుగోలు చేశాను. కల్తీ, నకిలీ విత్తనాల కారణంగా ఎకరానికి 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదముంది. దీనితో నేను తీవ్రముగా నష్టపోతాను. విత్తనాల కంపెనీ వారు ఆదుకోవాలి. కల్తీ, నకిలీ విత్తనాల గురించి గతంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు.
రైతు గోవిందరాజు, కూచిపూడి
విత్తనాల కంపెనీ వారు నష్ట పరిహారం ఇవ్వాలి
3 ఎకరాల్లో సన్నరకం వరి సాగు కోసం రూ. 11 వందలు పెట్టి 3 బస్తాలు కొని సాగు చేశాను. ఈ విత్తనాల కారణంగా నాకు దిగుబడి తగ్గుతుంది. విత్తనాల కంపెనీ వారు మాకు నష్టపరిహారం ఇవ్వాలి. మా ఊర్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అధికారులు, నాయకులు మాకు న్యాయం జరిగేలా చూడాలి.
రైతు, కూచిపూడి