16-09-2025 12:42:27 AM
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
మానకొండూరు, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి) మానకొండూరు నియోజకవర్గంలో పాలన అస్తవ్యస్తమైందని, మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు . యూరియా కోసం చెప్పులు, చెట్ల కొమ్మలు, పాసు బుక్కులు, ఇటుక వరుసలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఉనికి కోసం విమర్శలు కావని, యూరియా సంచుల కోసం అన్నదాతల అరిగోస పాలకులకు కనిపించడం లేదా అని ప్రభుత్వాన్ని పాత్రికేయుల సమావేశం సాక్షిగా నిలదీశారు.
భారత రాష్ట్ర సమితి పార్టీ మానకొండూరు మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, పిట్టల మధు, శాతరాజు యాదగిరి, తదితరులు, పార్టీ వర్గాలతో కలిసి పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రసమయి ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. పాలకుల అవగాహన లేమి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పోలీస్ స్టేషన్లో అన్నదాతలకు యూరియా టోకెన్ల పంపిణీ, పాలన అస్తవ్యస్తమైనదనటానికి నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రైతుల కడగండ్లను, తీర్చడానికి యూరియా డిమాండ్, సరఫరా పై అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. యూరియా డిమాండ్, పంపిణీ, లభ్యత అంశాలపై సంబంధిత అధికారులను సమన్వయ పరచటంలో ఎమ్మెల్యే సత్యనారాయణ నిస్సందేహంగా విఫలమయ్యారని రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా నల్ల బజారుకు తరలింపును నిలువరించాలని డిమాండ్ చేశారు. తెర వెనుక తతంగాన్ని, మంత్రాంగాన్ని నడిపిస్తున్న వారెవరని, ఈ యూరియా చీకటి దందాలో, షాడో ఎమ్మెల్యే హస్తముందని ఆయన ఆరోపించారు. తక్షణం ఈ విమర్శలు, ఆరోపణలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సమాధానం చెప్పాలనిడిమాండ్‌చేశారు.