calender_icon.png 6 October, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు పరిహారం అందలే

06-10-2025 12:22:05 AM

  1. సీఎం రేవంత్ హామీ ఇచ్చి, నెలరోజులైనా చెల్లించలేదు
  2. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలి
  3. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్
  4. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో నీట మునిగిన పొలాల పరిశీలన

కామారెడ్డి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి వరద బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ కవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో బంజారా గ్రామం వద్ద వరద బాధిత రైతులతో హరీశ్‌రావు మాట్లాడారు.

రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలో రహదారులు ఎక్కడికక్కడ తెగిపోవడంతో ప్రజలకు తీవ్ర అవస్థలు ఏర్పడ్డాయని, వారిని ఆదుకుంటామని, తెగిపోయిన రోడ్లకు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పరన్నారు. వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ప్రకటించి నెల రోజులు దాటుతున్నా ఇంతవ రకు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగారెడ్డిపేట్ తదితర మండలాలలో మంజీరా నది  పరివాహక ప్రాంతం లోఉన్న గ్రామాలు ఛీనూర్, వాడి, గొలిలింగాల, బంజారా, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, ఆత్మకూర్రం ఎర్రరం, ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం, మాత్తమాల, మల్కాపూర్ గ్రామాల రైతుల పంట పొలాల్లోకి ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుండి పసుపేరు నుండి ఉధృతంగా చేరి 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చె ప్పారు.

కామారెడ్డి జిల్లాలో 344 కోట్ల రూ పాయల పంట, ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు అధికారుల నుంచి నివేదికను అం దుకొని పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరనికి 25 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రభుత్వం అందజేయాలని డి మాండ్ చేశారు. పోచారం ప్రధాన కాలువ నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు జీవనాధారం అని ప్రధాన కాలువకు అయిదు చోట్ల గండి పడ్డదని అధికారులు కనీసం ఆ గండ్లను కూడా పూడ్చడం లేదని మండిపడ్డారు.

లింగంపేట్ మండలం కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై తెగిపోయిన బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాల్సిన నేపథ్యంలో నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో అని మండిపడ్డారు. ప్రజలకు రాకపోకల సౌకర్యాన్ని ప్రభుత్వం వెంటనే సమకూర్చాలని కోరారు. జిల్లాలో చాలా చోట్ల వర్షానికి ఇళ్లు కూలిపోయాయని.. బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు మంజూరు చేసి వారి ఆదుకోవాలని సూచించారు.

రోడ్లు దెబ్బతిన్నా కూడా రోడ్లు భవనాల శాఖ  మంత్రి కోమటిరెడ్డి రహదారులు పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, జనార్దన్‌గౌడ్, కామారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు ముజీబుద్దిన్ తదితరులు ఉన్నారు.