26-07-2025 07:12:39 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ, ఇఫ్కో సహకార సంఘం ఆధ్వర్యంలో నానో యూరియా ప్లస్, నానో డిఏపి పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భారతీయ రైతాంగ సహకార సంస్థ (ఇఫ్కో) అభివృద్ధి చేసిన నానో యూరియా (ద్రవ రూపం) దేశ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిందని సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను ప్రవేశపెట్టడం ద్వారా రైతుల ఖర్చులను తగ్గించి, పంట దిగుబడులను పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని వ్యవసాయ శాఖ పేర్కొన్నారు. నానో కణాలు మొక్క కణాలలోకి సులభంగా ప్రవేశించి, మొక్క ఎదుగుదల, అభివృద్ధికి అవసరమైన నత్రజనిని అందిస్తాయని ఉపయోగించని నత్రజని మొక్కలో నిల్వ చేయబడి, అవసరమైనప్పుడు నెమ్మదిగా విడుదల అవుతుందన్నారు.
అధిక సామర్థ్యం 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ 45 కిలోల సాంప్రదాయ యూరియా బస్తాకు సమానం అయినా నత్రజనిని మొక్కలకు మరింత సమర్థవంతంగా అందిస్తుందని తద్వారా యూరియా వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు,నానో యూరియా వాడకం వల్ల పంట దిగుబడులు 8% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇది మొక్కల కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరుస్తు, వేరు వ్యవస్థను బలోపేతం చేస్తుందని.రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నారు. నానో యూరియా నేల, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందని సూచించారు . రైతులు ఈ వినూత్న ఎరువును సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇఫ్కో మేనేజర్ డి నరేష్ ,పాక్స్ డైరెక్టర్ బాల ఎల్లం, ఇఫ్కో ఫీల్డ్ అసిస్టెంట్ బి రాజు,ప్యాక్స్ సీఈవో భార్గవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.