26-09-2025 12:00:00 AM
ఎరువుల లారీని ఆపి నిరసన
బూర్గంపాడు, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండల నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామాల రైతులు గురువారం యూరియా కోసం ఆందోళనకు దిగారు. యూరియా కోసం రైతులు బూర్గంపాడు సహకార సంఘం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. తమ పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందిన రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు.
నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం ప్రాంతంలో ఎరువులను తరలిస్తున్న ఓ లారీని ఆపి నిరసన వ్యక్తం చేశారు. యూరియా అందే వరకు లారీని కదలనిచ్చేది లేదని భీష్మించారు. బూర్గంపాడు సహకార సంఘం సీఈవో బత్తిన ప్రసాద్ చేరుకుని, యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటానని లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.