09-09-2025 05:29:05 PM
కూపన్లు ఇచ్చి యూరియా ఇవ్వడం లేదని రైతుల ఆందోళన..
భారీగా ట్రాఫిక్ జామ్
చిగురుమామిడి (విజయక్రాంతి): యూరియా కోసం క్యూలో నిలబడితే కూపన్లు ఇచ్చి వారం రోజులవుతున్నా ఇంతవరకు అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి మంగళవారం ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో కరీంనగర్, హుస్నాబాద్ వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాయికృష్ణ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకొని ఆందోళన విరమించేందుకు ప్రయత్నించగా, అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు పేర్కొన్నారు.
వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి రెండు రోజుల్లోగా కూపన్లు ఉన్న రైతులందరికీ యూరియాను పంపిణీ చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన నిర్వహించారు. సుమారు 450 మందికి పైగా రైతులకు వారం రోజుల క్రితం కూపన్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా కూడా రైతుకు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.