09-09-2025 05:31:23 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తన నవలల ద్వారా తెలియజేసిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలలో ఎస్.పి. కాంతిలాల్ సుభాష్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ లతో కలిసి హాజరై కాళ్లు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆ రోజులలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తన నవలల ద్వారా సమాజానికి తెలియజేసి ప్రజలందరినీ సంఘటితం చేశారని తెలిపారు. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక తీసుకొస్తుందని చాటి చెప్పారని చెప్పారు.
మన తెలుగు భాషకు, మాసాకు పట్టం కట్టాలని తన రచనలతో ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. కాళోజి జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం సంతోషంగా ఉందని, మహాకవి కాళోజి ఆశయాల సాధనకు అందరం సమిష్టిగా కృషిచేసి జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, జిల్లా రవాణా శాఖ అధికారి రామ్ చందర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ, జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.