09-09-2025 10:46:46 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని సత్యసాయినగర్ కు చెందిన ఆవునూరి అక్షయ్ కుమార్, ఆవునూరి సంజయ్ కుమార్, ఆవునూరి విజయ్ అనే ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించినట్లు ఎస్సై గోపతి సురేష్(SI Gopathi Suresh) మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఒకడైన ఆవునూరి అక్షయ్ కుమార్ అదే వాడలో ఉండే ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తూ వెంబడించేవాడన్నారు. బాధితురాలు గత ఏడాది అక్షయ్ కుమార్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయిందన్నారు. కొద్ది రోజుల తర్వాత కేసు రాజీ పడాలని బెదిరించగా మళ్ళీ పోలీసు స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. అతనిపై మళ్ళీ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
బాధితురాలు పెట్టిన రెండు కేసులు రాజీ కావాలని చెప్పిన కూడా రాజీ కావడం లేదని తండ్రి కూతురును చంపితే కేసు ఉండదు అని భావించిన నిందితుడు నిన్న రాత్రి తన ఇద్దరు సోదరులతో కలిసి బైక్ పై బాధితురాలి ఇంటికి వెళ్లి నిందితులు వెంట తెచ్చుకున్న కర్రలతో బాధితురాలిని, అదేవిధంగా వాళ్ళ తండ్రి లకావత్ రవీందర్ ను కర్రలతో కొట్టి చంపే ప్రయత్నం చేయగా ఇంట్లో ఉన్న బాధితురాలి తల్లి కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుండి పరార్ అయ్యారన్నారు. ఈ గొడవ విషయమై బాధితురాలు పిర్యాదు చేయగా ఎస్సై సురేష్ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరచి రిమాండుకు తరలించడం జరిగిందన్నారు. యువకులు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.