16-09-2025 12:00:00 AM
బాన్సువాడ, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్నకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసాయన సంతోషం వారిని సమస్యలుకి నెట్టింది. ఓవైపు యూరియా కష్టాలు, మరోవైపు వానలతో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.
సోయా సాగుకు నడుం బిగించిన రైతులకు అధిక దిగుబడులు సాధించి లాభాలను అర్జించాలన్న ఆశ నిరాశగా మిగిలిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోయా పంటలు నేలకొరిగి దర్శనమిస్తున్నాయి. సోయా పంటల పరిస్థితిని చూసి రైతులు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో సోయా పంట సాగుకు రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
జిల్లాలోని గాంధారి, తాడువాయి, లింగంపేట్, మధునూర్, బిచ్కుంద, జుక్కల్, మండలాల్లో నీ గ్రామాల్లో ఎక్కువగా రైతులు సోయా సాగు చేశారు. పంట ఎదుగుతున్న తరుణంలో భారీ వర్షాలు కురియడంతో సోయా పంట తీవ్రంగా దెబ్బతింటుంది. పంట ప్రగతి దశలోనే నిండా ముంచేతడంతో సోయా పరిస్థితి సోగయా లాగా తయారయింది.
పెట్టుబడి పోయింది.. రైతుల్లో ఆవేదన
సోయా సాగు జరుగుతున్న సమయంలో వానాల వల్ల తమ పంట పూర్తిగా నష్టపోయామని, పంటపై పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయినట్లేనని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం అందించేందుకు కోరుతున్నారు.
వరిసాగు కూడా అంతంత మాత్రమే..
కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వరి సాగు కూడా ఆశాజనకంగానే మారిందని, వానలతో వరి పంట తడిసి ముద్దవ్వడంతో ధాన్యం పొ ట్టపగిలి పంట సాగుకు నష్టం వాటిల్లి పరిస్థితి ఉంటుందని రైతులు దిగులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో అత్యధికంగా అన్ని మండలాల్లో వరి సాగు అధికంగా జరుగుతోంది. చిన్న సన్నకారు రైతులు నానా తంటాలు పడి పంట సాగుకు అడుగులు వేసినప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి.
బాన్సువాడ నియోజకవర్గం లో వరి సాగు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కొరత ఇబ్బంది పెట్టినప్పటికీ పంట సాగుకు సన్నద్ధమవుతుంటే భారీ వర్షాలు రైతులను మరింత బాధపెడుతున్నాయని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో కూడా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల మరిన్ని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచిస్తుండడంతో పంట సాగు పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన రైతులను కృంగదీస్తోంది.
గత రెండు మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్ ప్రకటించడంతో కురుస్తున్న వర్షాలకు పంట భూములు నీటితో నిండిపోయాయి. మరో రెండు మూడు రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే వరి పంట సాగు కూడా ప్రశ్నార్థకంగా మారి ప్రమాదం ఉంటుందని వ్యవసాయ అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు.