16-08-2025 12:00:00 AM
నంగునూరు, ఆగస్టు 15: నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలోని మోయ తుమ్మెద పెద్ద వాగు నుండి ఇసుక తవ్వకాలను ఆపాలని కోరుతూ గ్రామ రైతులు ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం శుక్రవారం అందజేశారు.
మండల పర్యటనలో భాగంగా అక్కెనపల్లి గ్రామానికి వచ్చిన హరీష్ రావును రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. పెద్ద వాగు నుండి అభివృద్ధి పనుల పేరుతో ఇసుక తరలించడానికి నంగునూరు తహసిల్దార్, రాజగోపాల్ పేట ఎస్‌ఐ ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు.
30 సంవత్సరాలుగా గ్రామస్థులు తమ వాగులోని ఇసుకను కాపాడుకుంటూన్నారని తెలిపారు. ఈ ప్రాంతం నుండి ఇసుకను తొలగిస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయని, తద్వారా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని కాపాడాలని, ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు ఎమ్మెల్యే హరీష్ రావును కోరారు.