29-10-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్28: మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యపురాసులపై టార్పాలిన్ పట్టాలు కప్పే విధంగా రైతులకు కేంద్రం నిర్వాహకులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. మండల పరిధిలోని తిమ్మాపురం,వేర్పుచర్ల,అర్వపల్లి గ్రామాలలో ఐకేపీ, ఎన్డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వరి పొలాలు కోయకుండా ఉండాలని, ఇప్పటికే పంట కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యపు రాసులు తడవకుండా టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచాలని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ మోహన్ బాబు,డీఎం రాము,తహాశీల్దార్ శ్రీకాంత్, ఏఎస్‌ఓ శ్రీనివాస్ రెడ్డి,ఆర్‌ఐలు శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఏఓ గణేష్,ఏపీఎం రాంబాబు, ఏఈఓ నేరెళ్ల సత్యం, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, కేంద్రాల నిర్వాహకులు దేవరకొండ విజయ, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.