29-10-2025 12:00:00 AM
తుర్కయంజాల్, అక్టోబర్ 28: తుర్కయంజాల్ మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని బాలాజీనగర్ కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ అమరేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పుల్లగుర్రం విజయానంద్ రెడ్డి, కాలనీ కార్యదర్శి జొన్నాడ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్రెడ్డిని స్థానికులు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ, అంతర్గత రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వర్షం పడినప్పుడు రోడ్లపై నడవడానికి కూడా వీల్లేకుండా ఉందని బాధను వ్యక్తపరిచారు. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోందని, ఖాళీ ప్లాట్లలో, రోడ్ల వెంబడి చెట్లు పెరిగిపోయాయని అన్నారు. దీంతో విష సర్పాలు ఇళ్ల మధ్యన తిరుగుతుండటంతో, స్థానికులు భయాందోళనలో జీవిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి బాలాజీనగర్ కాలనీలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుటాహుటిన డోజర్ సాయంతో చెట్లను తొలగిస్తామని వెల్లడించారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సత్యం గౌడ్, ఉపాధ్యక్షుడు పి.వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి కె.జంగయ్య, ట్రెజరర్ ఎం.మహేష్, సభ్యులు ఎ.మహేష్, దయానంద్ గౌడ్, నరేందర్ శర్మ, రాఘవ పంతులు, బురాన్ తదితరులు పాల్గొన్నారు.