30-10-2025 01:35:12 AM
వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109కు సంప్రదించాలి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు, అక్టోబరు29 (విజయక్రాంతి): తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, తహసిల్దార్లతో టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల.. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు రోజుల పాటు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని ఆదేశించారు. వర్షాల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109కు కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.