calender_icon.png 18 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి

17-10-2025 10:04:04 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

మండలంలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ,శంకుస్థాపనలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శుక్రవారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఐకేపీ కేంద్రం, తిమ్మాపురం గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని గంగ దేవమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని చెప్పారు.సన్నరకాల ధాన్యానికి క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు భరోసాతో పాటు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్లరేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రభుత్వమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.