23-10-2025 01:54:02 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
కౌడిపల్లి(మెదక్), అక్టోబర్ 22 (విజయక్రాంతి):రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో దాదాపు 100 కేంద్రాల్లో ధాన్యం రావడం మొదలైందన్నారు.కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని అందులో తేమ తొలగిన ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని తెలిపారు. టోకెన్ అందించడంతో పాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు. అనంతరం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన గుణాత్మక విద్యకు సోపానాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్యద్వారా అభివృద్ధి పథంలోకి రావాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.