06-11-2025 09:45:34 PM
సరైన తేమ శాతం వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తాం
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు, వసతులు, ధాన్యం తరలింపు తదితర అంశాలపై ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు.
ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలు పరిశీలించాలని, ఏమైనా స్థానిక ఇబ్బందులు పరిష్కరించాలని, ఇంకా ఏమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈరోజు వరకు జిల్లాలోని ఆయా కొనుగోలు కేంద్రాల్లో 37,050 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్డిఓ శేషాద్రి, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు